వైఎస్సార్‌ వల్లే పోలవరం పనులు: బీజేపీ ఎమ్మెల్సీ

13 Jun, 2018 12:14 IST|Sakshi

సాక్షి, విశాఖ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏమైనా పనులు జరిగాయంటే అది వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వల్లనే అని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ మాధవ్‌ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం పోలవరం నిర్మిస్తామంటే.. కమీషన్ల కోసమే చంద్రబాబు ప్రాజెక్టు పనులు చేపట్టారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం పోలవరంలో ఏ పనులు పూర్తి చేయలేదన్నారు. అవినీతి అక్రమాలతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దోపిడీతో పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇసుక దొరకని దుస్థితి ఏర్పడిందన్నారు. 

పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో రాష్ట్ర నాయకులు సమావేశమయ్యారని తెలిపారు. అమిత్‌ షా, గడ్కరీలు త్వరలో ఏపీలో పర్యటిస్తారని, అందుకు సంబంధించిన తేదీలు ఖరారు కానున్నాయన్నారు. ఆపరేషన్ గరుడా వంటివి భూటకమని, మిషన్ సౌత్ పేరుతో పార్టీ విస్తరించటానికి ఏడాది క్రితమే ప్రారంభమైంది. అయితే అక్రమ మార్గంలో కాదని, సంపర్క అభియాన్ కార్యక్రమం ద్వారా రెండు రోజుల పాటు ప్రముఖులు పర్యటన చేస్తూ ఎలాంటి అభివృద్ధి జరిగిందనేది ప్రజలనే అడిగి తెలుసుకుంటామన్నారు. కేంద్రం గృహాల నిర్మాణానికి నిధులిస్తుంటే బ్యాంకుల నుంచి రుణాలు ఎందుకు తీసుకోవాలన్నారు. 

గృహనిర్మాణ దారుడిని రుణగ్రస్తులను చేసింది రాష్ట్ర ప్రభుత్వమేనని విమర్శించారు. 2003లోనే రైల్వే జోన్ రావల్సిందని, ఎర్రన్నాయుడు రైల్వే బోర్డు చైర్మన్‌గా ఉన్నప్పుడే చంద్రబాబు రైల్వే జోన్ తెస్తామన్నారని గుర్తు చేశారు. బీజేపీ రైల్వే జోన్ తీసుకొస్తున్న తరుణంలో టీడీపీ నాయకులు దొంగ దీక్షలు ఎందుకు చేస్తున్నారన్నారు. 33 ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని, అందులో 10 ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులున్నాయన్నారు. జూలైలో బీజేపీ ప్రముఖుల పర్యటన ఉంటుందని వెల్లడించారు. 

>
మరిన్ని వార్తలు