టీడీపీకి గట్టి దెబ్బ: మాధవ్‌

21 Jul, 2018 16:34 IST|Sakshi
బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌

సాక్షి, తిరుపతి: లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాసం విగిపోవడం ద్వారా టీడీపీకి గట్టి దెబ్బ తగిలిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరువును టీడీపీ నాయకులు బజారుకు ఈడ్చారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌, టీడీపీ మైత్రీ బంధానికి లోకసభ వేదికగా నిలిచిందన్నారు. త్వరలో టీడీపీలో తిరుగుబాటు మొదలవుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌తో తమ పార్టీ కలిసి పనిచేయడం టీడీపీలోని సీనియర్‌ నాయకులకు ఇష్టం లేదని, అలాంటి వారందరూ తిరుగుబాటు చేయాడానికి సిద్ధమౌతున్నారని వెల్లడించారు.

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో గల్లా జయదేవ్ అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కేంద్ర ఆర్థికమంత్రికి సన్మానం, అసెంబ్లీ తీర్మానం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. మోదీని నిందించాలనే టీడీపీ కుట్ర బెడిసికోట్టిందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ వలలో చిక్కుకున్న పక్షి టీడీపీ అని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేకను కప్పిపుచ్చుకోవడానికి తమపై బురదచల్లాలని చూశారని మాధవ్‌ ఆరోపించారు. ఏపీ అభివృద్ధిపై బీజేపీ రాజీపడదని, ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. తెలుగుజాతికి తలవంపులు తెచ్చేలా టీడీపీ ఎంపీలు లోక్‌సభలో వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు