చంద్రబాబుకు మతి భ్రమించింది: సోము వీర్రాజు

31 Dec, 2018 18:40 IST|Sakshi

సాక్షి, విజయనగరం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మతి భ్రమించిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వంద దృతరాష్టులతో సమానమన్నారు. అధికారం కోసం సొంతమామనే వెన్నుపోటు పోడిచారని, రాజకీయాల్లో ఉండటానికి చంద్రబాబు అనర్హుడని దుయ్యబట్టారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలను ఇష్టం వచ్చినట్లు తిట్టి, ప్రధాని నరేంద్రమోదీని అభినందిస్తూ అసెంబ్లీలో ప్రకటించిన వ్యక్తి.. ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌, పవన్‌లు మోదీని తిట్టాలని చంద్రబాబు ఎలా అంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిపాలన అగమ్యగోచరంగా ఉందని, కేంద్రం తాజాగా రూ.700 కోట్లు ఇస్తామన్న యూసీలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.

పేద పిల్లలు హాస్టల్లో వసతులు లేక నరకం చూస్తున్నారని, అవి శ్వేతప్రతాల? లేక అవినీతి పత్రాలా? అని ప్రశ్నించారు. గ్రామాల స్వయం సమృద్ధికి బాట వేసిన వ్యక్తి మోదీ అని, ఎన్‌ఆర్‌జీఎస్‌ క్రింద వేల కోట్లు ఇస్తుంది కేంద్రం కాదా? అని సవాల్‌ చేశారు. కేంద్రం నిధులతో కాకుండా సొంతంగా ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. మోదీ అభివృద్ధి అయితే అవినీతి చంద్రబాబుదన్నారు. చెరువుల్లో మట్టి తవ్వడానికి రూ.16వేల కోట్లా? అని ప్రశ్నించారు. చెరువులు తవ్వితే.. అనంతపురంలో కరువు ఎలా వచ్చిందని నిలదీశారు. కమ్యూనిస్ట్‌లను సైతం చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారన్నారు.

మరిన్ని వార్తలు