నేను పక్కా లోకల్: సంజయ్‌

23 Mar, 2019 20:49 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను నరికి చంపుతా అన్న ఎంఐఎం పార్టీని పక్కన పెట్టుకుని, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు సెక్యులరిజం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు పలికినట్లుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌ ఎద్దేవా చేశారు. హిందూ ధర్మం, సమాజంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామ జన్మభూమి, కశ్మీర్‌లో 370 ఆర్టికల్ ఉండాలా? వద్దా?, త్రిపుల్ తలాక్, కశ్మీర్‌లో పండిట్ల వైఖరి గురించి కేసీఆర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ ఎన్నికలు దేశ ప్రధానిని నిర్ణయించే ఎన్నికలని, భారతదేశానికి దిక్సూచి.. దశ, దిశను  చూపించే వ్యక్తి ప్రధాని మోదీ అని పేర్కొన్నారు.

ఇతర పార్టీలు కనీసం వారి ప్రధాని అభ్యర్థిని ప్రకటించలేని స్థితిలో ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వాటా లేని సంక్షేమ పథకం ఉందా అని ప్రశ్నించారు. గ్రామాలు, నగరాల అభివృద్ధి కేంద్ర నిధులతో తప్ప రాష్ట్ర నిధులతో చేయలేదని స్పష్టం చేశారు. రాష్ట్రం.. గ్రామ పంచాయతీలకు ఒక పైసా కూడా విడుదల చేయలేదని తెలిపారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు, నగరాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ‘ఇక్కడ పోటీ చేసే ఎంపీ అభ్యర్థి నాన్ లోకల్, నేను పక్కా లోకల్.. ధర్మకార్యం నిర్వహించేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నా’నన్నారు.

మరిన్ని వార్తలు