కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కు అస్వస్థత

9 Apr, 2019 13:53 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. టవర్‌ సర్కిల్‌లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆయన స్పృహ కోల్పోవడంతో ఆందోళన చెందిన అభిమానులు, కార్యకర్తలు వెంటనే అంబులెన్సులో సమీప ఆస్పత్రికి తరలించారు. సంజయ్‌ను పరీక్షించిన వైద్యులు వడదెబ్బ కారణంగానే ఆయన కింద పడిపోయినట్లు భావిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కరీంనగర్‌లోని అపోలో రీచ్‌ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

కాగా, సంజయ్‌కు గతంలో హార్ట్ స్ట్రోక్ రావడంతో స్టంట్ వేశారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్వస్థతకు గురికావడంతో పార్టీ కార్యకర్తలతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడి ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ఈ క్రమంలో సంజయ్‌కు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఇక గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున బరిలోకి దిగిన బండి సంజయ్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాంతంలో మంచి పట్టు ఉన్న నాయకుడిగా పేరొందిన సంజయ్‌ పట్ల యువతకు ఉన్న అభిమానం, ఆయన సేవా కార్యక్రమాలు బీజేపీకి విజయం చేకూరుస్తాయని భావించిన అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా మరో అవకాశం కల్పించింది. కాగా సంజయ్‌తో పాటు కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థులుగా టీఆర్‌ఎస్‌ తరఫున జి. వినోద్‌కుమార్‌ పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కూడా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

మరిన్ని వార్తలు