ఇలాంటి గతి పట్టడం దురదృష్టకరం: ధర్మపురి

14 Jun, 2019 17:30 IST|Sakshi

నిజామాబాద్‌: నిజాం షుగర్‌ ఫ్యాక్టరీకి ఇలాంటి గతి పట్టడం దురదృష్టకరమని నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్‌ విలేకరులతో మాట్లాడుతూ.. షుగర్‌ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడమే పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన తప్పునకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడని శాపనార్ధాలు పెట్టారు. తెలుగు దేశం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ కూడా షుగర్‌ ఫ్యాక్టరీ అభివృద్ధిని అడ్డుకుందని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ అత్యంత తెలివైన అవినీతిపరుడని విమర్శించారు. దేశంలోనే అత్యంత అవినీతిపర ముఖ్యమంత్రుల్లో కేసీఆర్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారని దుయ్యబట్టారు.

లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీ నుంచి టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు సంపాదిస్తే టీఆర్‌ఎస్‌ మాత్రం నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని కూడా వదల్లేదని మండిపడ్డారు. సమస్య చెబుదామనుకుంటే దొర కిందకి దిగడు, సమస్య వినడు..యాజమాన్యం లెక్కలు అడిగితే అన్ని నోటి లెక్కలు చెప్పి తప్పుదోవ పట్టించారని దెప్పిపొడిచారు. ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి అధికారంలోకి వచ్చాక టీఆర్‌ఎస్‌లో మిగిలింది ఆ కుటుంబసభ్యులే అని పరోక్షంగా కేసీఆర్‌ కుటుంబం గురించి వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌ టెర్రరిస్తుల హబ్‌ అని ఆరోపించారు. రైతులకు అండగా నిలబడటానికి పెట్టుబడీదారులను ఆహ్వానిస్తున్నామని, త్వరలోనే పసుపు బోర్డు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు