పడవ నుంచి అమాంతం పడిపోయిన ఎంపీ..!

3 Oct, 2019 11:40 IST|Sakshi

పట్నా: చుట్టూ భారీగా వరద నీరు.. ఈ వరద నీటిలో ట్యూబులతో తయారుచేసిన తాత్కాలిక పడవలో ప్రయాణించి.. వరద బాధితులను పరామర్శించాలని ఓ ఎంపీ ప్రయత్నించారు. కానీ, వరదనీరు భారీగా ఉండటంతో ఎలాంటి రక్షణలు లేని తాత్కాలిక బోటులో ప్రయాణించాలని చూసిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ట్యూబులో తయారుచేసిన బోటులో ఎక్కువమంది ఉండటంతో.. అది అమాంతం మునిగిపోయింది. ఎంపీతోపాటు ఆయన వెంట ఉన్నవారు నీళ్లలో పడిపోయారు. సమయానికి అక్కడ ఉన్న స్థానికులు సహాయం చేయడంతో ఎంపీ సురక్షితంగా బటయపడ్డారు.

ఈ ఘటన బిహార్‌ పాట్నా జిల్లా మసౌర్హిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక బీజేపీ ఎంపీ రాంకృపాల్‌ యాదవ్‌ తాత్కాలిక బోటులో ప్రయాణించి.. వరద బాధితులను పరామర్శించేందుకు ప్రయత్నిం‍చారు. అయితే, ఎలాంటి రక్షణలు లేకుండా ఈ బోటు ప్రమాదకరంగా ఉండటం, దానిపై ఐదారుగురు ప్రయాణించడంతో నీళ్లలో కొద్దిదూరం వెళ్లకముందే.. ఇది అదుపుతప్పి నీళ్లలో మునిగిపోయింది. దానిపై ఉన్నవారంతా అమాంతం నీళ్లలో పడిపోయారు. సమయానికి అక్కడ ఉన్న స్థానికులు సహాయం చేయడంతో ఈ ప్రమాదం నుంచి ఎంపీతోపాటు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు