నన్ను అరెస్టు చేసే దమ్ముందా?

24 Dec, 2017 09:04 IST|Sakshi

జిహాద్‌పై నోరెత్తితే జైల్లో పెడతారా?

సర్కారుపై బీజేపీ నేత శోభ ధ్వజం

సాక్షి, బెంగళూరు: దమ్ముంటే తనను అరెస్టు చేయాలని ఎంపీ, బీజేపీ నాయకురాలు శోభ కరంద్లాజే ప్రభుత్వానికి సవాలు విసిరారు. జిహాద్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకే తనను జైలులో పెట్టాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. హన్నావరలో సంఘ్‌ కార్యకర్త పరేశ్‌మేస్తా హత్యతోపాటు కావ్యా నాయక్‌ అనే విద్యార్థి పై జరిగిన దాడిని ఖండిస్తూ సోషల్‌ మీడియాలో శోభ పోస్టులు చేయడంతో ఆమెపై స్థానిక పోలీస్‌స్టేషన్లో ఎఫ్‌ఐఆర్‌ దాఖలయ్యింది. ఈ నేపథ్యంలో శనివారం బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె తీవ్ర ఆగ్రహావేశాలతో మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు నేను భయపడబోను.

నన్ను అరెస్టు చేస్తే తదుపరి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కొన్ని మైనారిటీ వర్గాలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నా పట్టించుకోకుండా, భారత సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం పోరాడుతున్న వారి పై కేసులు నమోదు చేస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలని చూడటం ఎంతవరకూ సమంజసం’ అని మండిపడ్డారు. వీరశైవ– లింగాయత సముదాయం మధ్య చిచ్చుపెట్టి లింగాయత్‌ సముదాయానికి మైనారిటీ హోదా కల్పించాలని కాంగ్రెస్‌ పార్టీ భావించడం వెనుక రాజకీయ కుట్ర దాగుందని శోభ విమర్శించారు.

మహదాయిపై రాహుల్‌ వైఖరేమిటి?
 మహదాయి సమస్య పరిష్కారం కోసం ట్రిబ్యునల్‌ పరిధిలోనే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడైన యడ్యూరప్ప, గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ పనిచేస్తుంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఇరు రాష్ట్రాల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని శోభ అన్నారు. గోవాలోని కాంగ్రెస్‌ నాయకులు కర్ణాటకకు చుక్క నీరుకూడా వదలమని చెబుతున్నారన్నారు. ఈ వ్యవహారంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు మహదాయిపై వారి వైఖరి ఏమిటనేది చెప్పాలని కోరారు.

మరిన్ని వార్తలు