రాజీవ్‌ గాంధీపై వివాదాస్పద ట్వీట్‌

17 May, 2019 13:02 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: మక్కల్‌ నీది మయ్యం చీఫ్‌ కమల్ హాసన్ నాథూరం గాడ్సేపై చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  ఏడో విడత ఎన్నికల్లో అవే వ్యాఖ్యలను ప్రధాన పార్టీలన్నీ ప్రచార అస్త్రాలుగా చేసుకుని.. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి. గాడ్సే స్వతంత్ర దేశంలో తొలి హిందూ తీవ్రవాదిగా కమల్‌ వ్యాఖ్యానించగా.. గాంధీని హత్యచేసిన గాడ్సే దేశ భక్తుడని భోపాల్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్‌ అభిప్రాయపడ్డారు. తాజాగా మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీని గాడ్సేతో పోల్చుతూ కర్ణాటక బీజేపీ ఎంపీ నళిన్‌ కుమార్‌ కాటిల్‌ వివాదాస్పద ట్వీట్‌ చేశారు.

‘‘నాథూరాం గాడ్సే కేవలం మహాత్మ గాంధీని మాత్రమే హత్య చేశాడు. ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ ముంబై దాడుల్లో 72 మృతికి కారణమైయ్యాడు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 17000 మందిని హత్య చేశారు. వీరిలో ఎవరు ప్రజల పట్ల అతి క్రూరంగా ప్రవర్తించారో అర్థమవుతోంది’ అని ట్వీట్‌ చేశారు. ఇందిరా గాంధీ హత్య అనంతరం సిక్కుల ఊచకోతలో మూడు రోజుల్లో 3000 మంది అమాయక సిక్కులను హతమార్చినట్లు  నళీన్‌ అభిప్రాయపడ్డారు. కాగా రెండు ఎంపీగా విజయం సాధించిన కాటిల్‌ ఈసారి దక్షిణ కన్నడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా ఆయన ట్వీట్‌ చేసిన కాసేపటికే తీవ్ర విమర్శలు రావడంతో ట్విటర్‌ ఖాతానుంచి తొలిగించారు.


 

మరిన్ని వార్తలు