ఈ వయసులో నేర్చుకోవడమేంటి?

22 Jun, 2018 11:16 IST|Sakshi
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. పక్కన ఎంపీ సరోజ్‌ పాండే

రాయ్‌పూర్‌: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యురాలు సరోజ్‌ పాండే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీని ‘మందబుద్ధి వ్యక్తి’గా ఆమె అభివర్ణించారు. ‘కాంగ్రెస్‌లాంటి అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న రాహుల్‌ను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తోంది. ఆయన రాజకీయాలను ఇప్పటికీ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారంట. ఆ విషయాన్ని స్వయంగా ఆ పార్టీ పెద్దలే చెబుతున్నారు. కానీ, ఓ వ్యక్తి 40 ఏళ్ల వయసులో ఇంకా నేర్చుకోవటం ఏంటి? అలాంటి వారిని మందబుద్ధి వ్యక్తులనే పిలవాల్సి ఉంటుంది’ అని ఆమె వ్యాఖ్యానించారు. 
 
ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేసే క్రమంలో ఆ మధ్య రాహుల్‌ చేసిన ఓ ప్రసంగం సోషల్‌ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది. ‘శిఖంజి వ్యాఖ్యలు’ తిరిగి రాహుల్‌నే విపరీతంగా ట్రోల్‌ చేశాయి. ఈ నేపథ్యంలోనే గురువారం దుర్గ్‌ ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె రాహుల్‌ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘మందబుద్ధి’ వ్యక్తిగా వ్యాఖ్యానించారు. కాగా, ఈ వ్యాఖ్యలపై ఛత్తీస్‌ఘడ్‌ కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. రాహుల్‌కు క్షమాపణలు చెప్పాలని సరోజ్‌ ఇంటి వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.

మరిన్ని వార్తలు