నేనొక దళిత ఎంపీని, తిట్టి.. గెంటేశారు

5 Apr, 2018 16:17 IST|Sakshi

సీఎం యోగిపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

ఫిర్యాదు చేస్తూ ప్రధాని లేఖ

లక్నో : ఉత్తర ప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీ ఎంపీ ఛోటే లాల్‌ ఖర్వార్‌.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై సంచలన ఆరోపణలకు దిగారు. దళితుడిని అయినందుకు తనపై సీఎం వివక్షత ప్రదర్శిస్తున్నారంటూ ఖర్వార్‌ ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. 

‘అయ్యా.. నా పేరు నేను కున్వర్‌ ఛోటే లాల్‌ ఖర్వార్‌(45). యూపీలోని రాబర్ట్స్‌గంజ్‌ నియోజక వర్గ ఎంపీని. నా నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని సీఎం కార్యాలయానికి లేఖ రాశాను. బదులు లేకపోవటంతో స్వయంగా నేను కార్యాయానికి రెండుసార్లు వెళ్లాను. దళితుడిని అయినందుకు నన్ను లోపలికి అనుమతించలేదు. పైగా తిట్టి బయటకు గెంటేశారు. సొంత పార్టీ ప్రజాప్రతినిధికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. ఇక ప్రజల సంగతేంటి? ప్రజాదర్భార్‌ పేరిట ఆయన(యోగి) చేస్తున్నదంతా డ్రామానేనా?. యూపీలో దళితుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందనటానికి ఇదే ఉదాహరణ. దీనిపై మీరు స్పందించాలి.’ అని లేఖలో మోదీకి విజ్ఞప్తి చేశారు. 

దీనిపై ప్రధాని స్పందించి.. చర్యలు తీసుకుంటానని ఖర్వార్‌కు హామీ ఇచ్చినట్లు ఓ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. మరోవైపు ఈ వ్యవహారంపై పార్టీ చీఫ్‌ మహేంద్ర నాథ్‌ పాండేకు మూడుసార్లు ఫిర్యాదు చేసిన స్పందించలేదని.. అందుకే తాను ప్రధానికి లేఖ రాశానని ఖర్వార్‌ చెబుతున్నారు. అంతేకాదు యోగి హయాంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని.. పైగా  ఫిర్యాదు చేసినందుకు కొందరు తనను చంపుతామంటూ బెదిరించారని ఖర్వార్‌ ఆరోపిస్తున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా