ఎమ్మెల్యేను షూతో చితక్కొట్టిన బీజేపీ ఎంపీ

6 Mar, 2019 20:32 IST|Sakshi

లక్నో : ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు...తాము ఎక్కడ ఉన్నామో, ఏం చేస్తున్నామో అనే ఇంగిత జ్ఞానం మర్చిపోయారు. శిలా ఫలకంపై పేరు లేదంటూ జరిగిన వాగ్వివాదం కాస్త.. బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే బహిరంగంగా చెప్పులతో పరస్పరం కొట్టుకునేంతవరకూ వెళ్లింది. ఉత్తరప్రదేశ్‌ సంత్‌ కబీర్‌ నగర్‌ కలెక్టరేట్‌లో జరిగిన ఈ తతంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.... బుధవారం సంత్ కబీర్ నగర్ జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశానికి బీజేపీ ఎంపీ శరద్‌ త్రిపాఠీ, ఎమ్మెల్యే రాకేష్‌ సింగ్‌ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా స్థానికంగా రోడ్డు నిర్మాణం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకంపై తన పేరు ఎందుకు లేదంటూ ఎంపీ శరద్‌ త్రిపాఠీ స్థానిక ఎమ్మెల్యే అయిన రాకేష్‌ సింగ్‌ను ప్రశ్నించారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య కొద్దిపాటి వాగ్వివాదం చోటుచేసుకుంది. అది కాస్తా తీవ్రస్థాయికి చేరడంతో ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ నేపథ్యంలో సహనం కోల్పోయిన ఎంపీ  శరద్‌ త్రిపాఠీ.. కాలికి ఉన్న షూ తీసి ఎమ్మెల్యేను చితక్కొట్టాడు. దీంతో ఎమ్మెల్యే రాకేష్‌ సింగ్‌ కూడా ఎంపీపై చేయి చేసుకున్నాడు. 

అయితే వారికి సర్ధిచెప్పేందుకు అక్కడున్న పార్టీ నేతలు, అధికారులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి, ఇద్దరు నేతలను శాంతింప చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ వ్యవహారం మొత్తం యూపీ మంత్రి అశుతోష్ టండన్ సమక్షంలోనే జరగడం గమనార్హం. మరోవైపు ఎంపీ శదర్‌ త్రిపాఠీపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే అనుచరులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనపై రాష్ట్ర బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

మరిన్ని వార్తలు