మోదీ రేటింగ్‌  90 శాతానికి పైగానే.. 

31 May, 2020 05:14 IST|Sakshi

రెండోసారి ప్రధాని అయ్యాక ఎన్నో సాహసోపేత నిర్ణయాలు 

కరోనా మహమ్మారిని దీటుగా ఎదుర్కొన్నారు 

రాష్ట్రాలను ఏకతాటిపై నడిపించారు.. ప్రజలంతా ఆయనకు అండగా నిలిచారు

మన సకారాత్మక దౌత్యనీతి ద్వారానే చైనా వెనక్కి తగ్గింది 

నేపాల్‌–భారత్‌లను ఎవరూ విడదీయలేరు 

‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్

(వెంకటేష్‌ నాగిళ్ల, సాక్షి ప్రతినిధి): అఖండ మెజారిటీతో రెండోసారి ప్రధాని అయిన తర్వాత నరేంద్ర మోదీ.. ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ అన్నారు. ముఖ్యంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎంతో ధీటుగా ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ విపత్కర సమయంలో అన్ని రాష్ట్రాలను ఏకతాటిపై నడిపించారన్నారు. ప్రజలు సైతం ఆయనకు సబ్‌ కా విశ్వాస్‌ అంటూ అండదండలందించారని చెప్పారు. ఎక్కువ కాలం అధికారంలో ఉంటే వ్యతిరేకత పెరగడం సహజమని.. కానీ, దీనికి భిన్నంగా మోదీ రేటింగ్‌ 90శాతానికి పైగా ఉందని రామ్‌మాధవ్‌ వివరించారు. అలాగే.. ఈ ఏడాది కాలంలో ప్రధాని ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ప్రధాని మోదీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రామ్‌మాధవ్‌ ‘సాక్షి ప్రతినిధి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

ఆర్థిక రంగంపై.. 
► 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీసాధించే దిశగా వెళ్తున్నాం. 
► బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలు తీసుకువస్తున్నాం. 
► ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు అనేక సంస్కరణలు తీసుకువస్తున్నాం. కొత్త ప్యాకేజీలను ప్రకటించాం. 
► పలు పథకాలను రాష్ట్రాలతో కలిసి అమలుచేస్తాం. 

కరోనా కట్టడిపై.. 
► దేశ ఆర్థిక వ్యవస్థను పట్టా లెక్కించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ విపత్తు వచ్చింది.  
► కరోనా కాలంలో రాష్ట్రాలన్నిటినీ ప్రధాని ఏకతాటిపై నడిపించారు. 
► ఈ విషయంలో 130కోట్ల మంది  ప్రధానికి అండగా నిలబడ్డారు. 
► పేదలను ఆదుకునేందుకు వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేశాం, గ్యాస్‌ సిలిండర్లు అందజేశాం.  
► రైల్వే శాఖ 30లక్షల మంది వలస కూలీలను స్వస్థలాలకు పంపించింది. 
► కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఉచితంగా డబ్బులిచ్చే ప్యాకేజీ కాదు. ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే ప్యాకేజీ ఇది. 
► రాష్ట్రాల అవసరం మేరకు కేంద్రం సహకారం అందిస్తుంది. అంతేతప్ప నేరుగా వారికి డబ్బులు ఇవ్వం. 

 చైనాతో  సంబంధాలపై.. 
► చైనాతో భారత్‌ ఎప్పుడు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించలేదు. 
► ఒక్క అంగుళం భూముని కూడా వదిలిపెట్టే ప్రసక్తిలేదు. 
► మన సకారాత్మక దౌత్యనీతి ద్వారానే చైనా వెనక్కి తగ్గింది. 
► ఎప్పటికీ భారత్‌ తన ఎల్‌ఏసి (వాస్తవాధీన రేఖ) వద్ద తన మౌలిక సదుపాయాలను పెంచుకుంటుంది.  
► ఇక నేపాల్‌తో సమస్యలు దౌత్యపరంగా పరిష్కరిస్తాం. నేపాల్, భారత్‌లను ఎవరూ వేరు చేయలేరు. 

కశ్మీర్‌ అంశంపై.. 
► ఆర్టికల్‌ 370 రద్దుచేశాం. ఇది జరిగి తొమ్మిది నెలలు గడిచినా ప్రజలు రోడ్లపైకి రాలేదు. 
► దీని తర్వాత కశ్మీర్‌లో స్థానికంగా ఉగ్రవాదుల రిక్రూట్మెంట్‌ లేదు.  
► ఈ సంవత్సరాంతానికి కాశ్మీర్‌లో ఎన్నికలు జరుగుతాయి. 
► కరోనా కాలంలోనూ పాకిస్తాన్‌ బుద్ధి మారలేదు. ఈ సమయంలోనూ ఉగ్రవాదులను పంపుతోంది. 
► అయినా మన భద్రతా బలగాలు వారిని కఠినంగా అణిచివేస్తున్నారు. 

ఇవేకాక.. 
► రామమందిర నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటుచేశాం. 
► ముస్లిం మహిళల చిరకాల వాంఛ ట్రిపుల్‌ తలాక్‌ను రద్దుచేశాం. 

>
మరిన్ని వార్తలు