‘టీడీపీ తప్ప ఏపార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటాం’

9 Dec, 2018 18:25 IST|Sakshi

తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ జాతీయ నేత, ఏపీ బీజేపీ ఇంచార్జ్‌ సునీల్‌ వి. డియోదర్‌ మండిపడ్డారు. ఆయన చందాలు వసూలు చేసే చందా బాబు అంటూ విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సునీల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. బాహుబలి సినిమాలో కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్టుగా చంద్రబాబు ఎన్‌టీఆర్‌ని వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఊసరవెల్లి లాగా రంగులు మార్చడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. జనవరి 6వ తేదీన ఆంధ్రాలో నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామన్నారు.

టీడీపీ తప్ప ఏ పార్టీ అయినా మా దగ్గరకు వస్తే పొత్తు పెట్టుకునేందుకు పరిశీలిస్తామన్నారు. మేమైతే ఎవరి దగ్గరకు వెళ్లి పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఓ గజదొంగ అని, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. చందా బాబుకు డబ్బే కావాలి ఇంకేం అవసరం లేదని వ్యంగ్యంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తన ప్రభుత్వ పథకాలుగా పేరు మార్చుకుంటూ తానే అంతా అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడని ధ్వజమెత్తారు.

రాజధాని అమరావతిలో, విశాఖపట్నం పోర్టు రైతుల నుంచి పొలాలు లాక్కుని వారిని మోసం చేశారని ఆరోపించారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ పెద్ద డ్రామా పార్టీ  అని, రాబోయే రోజుల్లో ప్రజలు భూస్థాపితం చేస్తారని దుయ్యబట్టారు. బీజేపీ లేకుండా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేదని వ్యాఖ్యానించారు. అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని వెంటనే నిర్మించాలని పార్లమెంటులో చట్టం తీసుకురావాలని దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా  తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు