రాష్ట్రంలో టీడీపీ అవినీతి పాలన

5 Feb, 2019 08:36 IST|Sakshi

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా

విజయనగరం అర్బన్‌: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన అవినీతిమయంగా మారిందని  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. కేంద్రం నిధులిస్తే వాటిని వినియోగించుకొని తమ పథకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. ‘జనచైత్య’, ‘సత్యమేవ జయతే’ అనే పేర్లతో రాష్ట్రంలో ప్రధాని మోదీ, అమిత్‌షా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా స్థానిక మెసానిక్‌ టెంపుల్‌లో సోమవారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోదీని  ప్రధానిగా చేస్తూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి కీలకంగా నిలిచే విధంగా ఫలితాలను తీసుకురావాలని కోరారు. అలా చేసినపుడే రాష్ట్రంలో అవినీతి పాలనను బీజేపీ అడ్డుకోగలుగుతుందని అన్నారు.

దేశంలో రెండు కోట్ల ఇళ్లను పేదలకు ఇవ్వడానికి నిర్దేశిస్తే అందులో అత్యధికంగా 10 లక్షల ఇళ్లను ఆంధ్రప్రదేశ్‌కే ఇచ్చామని అన్నారు. ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన 30 కోట్ల మందికి దేశ వ్యాప్తంగా ప్రయోజనం కలిగించగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహకరించకపోయినా అందులో 90 లక్షల మంది ఆంధ్రప్రదేశ్‌ పేదలే ఉన్నారని చెప్పారు. ఉజ్వల పథకం ద్వారా 6 కోట్ల మంది పేద మహిళలకు ఉచితంగా గ్యాస్‌ అందజేస్తే అందులో ఆంధ్రప్రదేశ్‌ మహిళలు లక్షల్లో ఉన్నారని చెప్పారు. మహిళా మోర్చా జాతీయ కార్యదర్శి పురందేశ్వరి మాట్లాడుతూ గ్రామాల్లోని బూత్‌ కమిటీ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందజేసిన సహాయ సహకారాన్ని క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.  నమో యాప్‌ను ప్రతి బూత్‌ కమిటీతో పాటు ప్రతి కార్యకర్త స్మార్ట్‌ఫోన్‌లో లోడ్‌ చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో చంద్రబాబు ముంచేసారని ఆరోపించారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ ఉన్నది ఉన్నట్లు ఇటీవల అసెంబ్లీలో మాట్లాడితే ముఖ్యమంత్రికి ఆక్రోషం పుట్టుకొచ్చిందన్నారు. అనైతికంగా ఎమ్మెల్యేలను కొని వాళ్లకు మంత్రుల్ని చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. రంగుల మార్చిన తెలుగు డ్రామా  పార్టీగా గుర్తింపు పొందిందని విమర్శించారు.

అమరవీరుల తల్లులకు ఘన సత్కారం
జిల్లాకు చెందిన పలువురు అమర వీరుల తల్లులను తొలిత ఘనంగా సత్కరించారు. బాడంగి మండలం గొల్లాదికి చెందిన సైనికుడు బొట్ట సత్యం తల్లి నారాయణమ్మను, మరడాం గ్రామానికి చెందిన మామిడి నాగరాజు తల్లి లక్ష్మిని సత్కరించారు. అదే విధంగా సిపాయి సౌర్యచక్ర అవార్డు గ్రహీత ఆబోతులు వెంకటరమణను అభినందించారు.

సభలో సంచితా హైలెట్‌
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా బహిరంగ సభలో విజయనగరం పూసపాటి రాజుల వారసురాలు హైలెట్‌గా నిలిచారు. మాజీ మంత్రి పూసపాటి  ఆనందగజపతిరాజు మొదటి భార్య ఉమాగజపతిరాజు కుమార్తె సంచితా గజపతిరాజు సభలోని వేదికపై కనిపించింది. ఆమె ఇటీవల ఢిల్లీలో బీజేపీ కండువా వేసికున్న విషయం తెలిసిందే. ఆమె తండ్రి ఆనందగజపతిరాజు స్థానిక ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజుకి స్వయాన అన్నయ్య కావడంతో ప్రాంగణంలో అందరి దృష్టి ఆమెపైనే పడింది. అనంతరం ఉత్తరాంధ్ర పార్లమెంటరీ నాలుగు నియోజకవర్గం పరిధిలోని పార్టీ పరిస్థితిపై సమీక్షా సమావేశాన్ని  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్‌ నిర్వహించారు. సమావేశంలో పార్టీ జాతీయ నాయకులు సత్యకుమార్, సతీష్, రాష్ట్ర ఇన్‌చార్జ్‌ మురళీధర్, సహ ఇన్‌చార్జ్‌ సునీల్‌ దేవదర్, ఎంపీ హరిబాబు, ఎమ్మెల్సీ మాధవ్,  రాష్ట్ర కోశాధికారి పాకలపాటి సన్యాసిరాజు, జిల్లా ఇన్‌చార్జ్‌ రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు డాక్టర్‌ పెద్దింటి జగన్మోహన్‌రావు, ప్రధాన కార్యదర్శి సత్తి అచ్చిరెడ్డి, అశోక్, జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు