రూ.15 లక్షలు వేస్తామని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదు

9 Apr, 2019 14:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తాము నల్లధనాన్ని వెనక్కి తీసుకు వస్తామని చెప్పామే, తప్ప ప్రజల బ్యాంకు ఖాతాల్లో నగదు వేస్తామని చెప్పలేదన్నారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ...‘ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని బీజేపీ ఎన్నడూ చెప్పలేదు. నల్లధనంపై చర్యలు తీసుకుంటామని మేము చెప్పాము. నల్లధనంపై మా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది’ అని అన్నారు.

కాగా 2014 ఎన్నికల్లో దేశంలోని ప్రతి పౌరుడి బ్యాంక్‌ ఖాతాలో 15 లక్షలు వేస్తామంటూ నరేంద్ర మోదీ చెప్పారని, ఆ హామీని నెరవేర్చలేదని కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు... ఎన్డీయే సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రతిపక్ష నేతలపై ఐటీ, ఈడీ దాడులపై రాజ్‌నాథ్‌ స్పందించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా, ఆయా శాఖలు తమ పని తాము చేసుకుపోతున్నాయన్నారు. ఐటీ దాడులతో కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధమని, ఆ దాడులపై తామెలా జోక్యం చేసుకుంటామని ఆయన ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు