'రాజే'యోగం కోసం..

11 Nov, 2018 01:26 IST|Sakshi

రాజస్తాన్‌లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. సర్వేల్లో వెల్లడవుతున్న అంచనాలు నిజం కాకుండా ఉండేందుకు త్రిముఖ వ్యూహాన్ని అమలుచేస్తోంది. ప్రభుత్వంపై ఐదేళ్లలో పెరిగిన వ్యతిరేకతను తగ్గించుకోవడంతోపాటు.. విపక్షంలో చీలిక తేవడం, సోషల్‌ ఇంజనీరింగ్, హిందువుల శ్రేయస్సును కోరే ఏకైక పార్టీ బీజేపీయేనన్న భావనను ప్రచారం చేయడం అన్న మూడు అంశాలపై దృష్టిపెట్టారు. డిసెంబర్‌ 7న ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ వ్యూహాలను అమలుచేసేందుకు కమలనాథులు రంగంలోకి దిగారు. 

కాంగ్రెస్‌ అనైక్యతపై దృష్టి! 
ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌లో సహజంగానే అనైక్యత ఎక్కువగా ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది వసుంధరా రాజే వ్యూహం. అందుకే తన ప్రచారంలోనూ కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రి అభ్యర్థే లేరంటూ విమర్శలు చేస్తున్నారు. సచిన్‌ పైలట్, మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ సీఎం పీఠం కోసం ఎలా కొట్లాడుకుంటున్నారో ప్రజలకు వివరిస్తున్నారు. ఈ ఇద్దరు తమను తాము సీఎంలుగా ప్రకటించుకుంటూ.. కేబినెట్‌లను రెడీ చేసుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. అటు, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా కూడా తన ప్రచారంలో కాంగ్రెస్‌ అనైక్యతపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరో ఇంకా రాహుల్‌కే అర్థం కావడం లేదంటున్నారు. అశోక్‌ గెహ్లాట్‌ సీఎంగా రెండుసార్లు ఎలా విఫలమయ్యారో వివరిస్తున్నారు. అటు బీజేపీ నేతలు కూడా తమ క్షేత్రస్థాయి ప్రచారంలో గుజ్జర్‌ సామాజిక వర్గానికి చెందిన పైలట్‌పైకి మీనాలను ఎగదోస్తున్నారు. మీనాలు, గుజ్జర్ల మధ్య అనాదిగా ఉన్న శత్రుత్వాన్ని రెచ్చగొడుతున్నారు. రాజస్తాన్‌లో కార్యకర్తలను కాంగ్రెస్‌ నేతలు పట్టించుకోవడం లేదంటూ రాహుల్‌ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ప్రజల్లో కాంగ్రెస్‌లో నెలకొన్న అనిశ్చితిని మరింత ఎక్కువగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. మదన్‌లాల్‌ సైనీ వంటి సాధారణ కార్యకర్తను రాష్ట్ర అధ్యక్షుడిగా చేశామని బీజేపీ అంటోంది. 
 
సూరజ్‌ గౌరవ్‌ యాత్రతో.. 
ప్రభుత్వ వ్యతిరేకత తగ్గించేందుకు సీఎం వసుంధర ‘సూరజ్‌ గౌరవ్‌ యాత్ర’ పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. సీఎంగా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న అపవాదును తొలగించుకుంటూ.. తమ ప్రభుత్వం ఏమేం చేసిందో, చేస్తుందో వివరిస్తున్నారు. నియోజకవర్గం వారిగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గుర్తుచేస్తున్నారు. ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, గోవధ నిషేధం, జీఎస్టీ, పెట్రోలుపై రాష్ట్ర ప్రభుత్వ పన్ను తగ్గింపు, రైతులకు రూ.50వేల లోపు రుణమాఫీ, వ్యవసాయ విద్యుత్‌కు ఏటా పదివేల వరకు సబ్సిడీ వంటి అంశాలను ప్రజలకు వివరిస్తూ వారి అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత కొంతమేర తగ్గిందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. రాజస్తాన్‌కు పెద్దగా ఒరిగిందేమీ లేదన్న విషయంలో సీఎం, బీజేపీ నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం లేదు.
 
సోషల్‌ ఇంజనీరింగ్‌తో.. 
ఇన్నాళ్లుగా రాజస్తాన్‌లో బీజేపీకి బలం రాజ్‌పుత్‌లు. ఈసారి వీరు పార్టీకి దూరమవుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. కనీసం 30 చోట్ల వీరి ప్రభావం ఉంటుందని పార్టీ అంచనా వేస్తోంది. దీంతో వీరిని మళ్లీ తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జాట్‌లకు బీజేపీపై ఉన్న కోపం తగ్గేందుకు 14 మంది జాట్‌లను షెడ్యూల్‌ విడుదలకు కొద్దిరోజుల ముందే ఎస్పీలుగా నియమించింది. దీనికి తోడు రాష్ట్రంలో 88% ఉన్న హిందువుల ఓట్లను కాపాడుకునేందుకు యోగి ఆదిత్యనాథ్‌ను సున్నితమైన ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనుంది. గౌరవ్‌ యాత్ర సందర్భంగా వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో కులసమీకరణాలు, అభ్యర్థి సత్తా ఆధారంగా గెలిచే అవకాశమున్న బీజేపీ అభ్యర్థులతో ఓ జాబితాను తయారుచేశారు. ఇందులో 60 మంది సిట్టింగ్‌లకు చోటు దక్కలేదు. అయితే తన ప్రమేయం లేకుండా రాజే జాబితా రూపొందించడాన్ని అమిత్‌ షా అంగీకరించడం లేదని సమాచారం. దీనిపై చిక్కుముడి వీడితే అభ్యర్థుల ప్రకటనతోపాటు ప్రచారం మరింత  జోరందుకునేందుకు ఆస్కారం ఉంటుందని కార్యకర్తలు భావిస్తున్నారు.

వంద మంది ఔట్‌! 
బీజేపీ అధిష్టానంతోపాటు పలు సంస్థలు జరిపిన సర్వేల్లో.. బీజేపీకి ప్రస్తుతం ఉన్న 161 మంది ఎమ్మెల్యేల్లో 100 మంది మళ్లీ గెలిచే పరిస్థితుల్లేవని స్పష్టమైంది. దీంతో ఈ స్థానాల్లో కొత్త అభ్యర్థులకోసం బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. నియోజకవర్గానికి ముగ్గురు బలమైన అభ్యర్థులను పరిశీలించి.. అందులో కులం, స్థానికంగా బలం ఆధారంగా ఒకరికి టికెట్‌ ఇవ్వనుంది. దీనికితోడు టికెట్‌ రాని వారు రెబెల్స్‌గా పోటీలో ఉండకుండా బుజ్జగింపుల పనులూ ప్రారంభించారు. అయితే కనీసం 15 రిజర్వ్‌డ్‌ స్థానాల్లో బీజేపీ నుంచి టికెట్‌ రాని నేతలు బీఎస్పీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అటు, రాష్ట్రం నుంచి పార్లమెంటుకు ఎన్నికైన 23 మందిలో 15 మంది అసెంబ్లీలో పోటీకి సిద్ధమవుతున్నారు.  

మరిన్ని వార్తలు