తర్వాత లక్ష్యం రాజస్తానేనా?

11 Mar, 2020 01:52 IST|Sakshi

న్యూఢిల్లీ: నిన్న కర్ణాటక, ఇవాళ మధ్యప్రదేశ్‌.. మరి రేపు? బీజేపీ ఆపరేషన్‌ కమల్‌ జాబితాలో తర్వాత రాష్ట్రం రాజస్తానేనా.. ఇదీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఎందుకంటే రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం స్వల్ప మెజార్టీతో నెట్టుకొస్తోంది. ఆ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్, ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ మధ్య వ్యవహారం ఉప్పు, నిప్పుగానే ఉంది. రాజస్తాన్‌లోని కోటాలో చిన్నారుల మృతి దగ్గర్నుంచి ఎన్నో అంశాల్లో సచిన్‌ పైలట్‌ బహిరంగంగానే తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. ప్రముఖ వజ్రాల వ్యాపారి రాజీవ్‌ అరోరాను రాజ్యసభకు పంపాలన్న గహ్లోత్‌ ప్రతిపాదనను సచిన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మధ్యప్రదేశ్‌ తరహాలోనే సచిన్‌ పైలట్‌పై ఆపరేషన్‌ కమల్‌ను ప్రయోగిస్తే, ఆ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌కు తీవ్రమైన నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజస్తాన్‌ అసెంబ్లీలో మొత్తం సభ్యుల బలం 200 కాగా కాంగ్రెస్‌కు 112 మంది సభ్యుల మద్దతు ఉంది. వీరిలో సీపీఎం నుంచి ముగ్గురు, ఆర్‌ఎల్‌డీ నుంచి ఇద్దరు ఉన్నారు. ఇక బీజేపీకి 80 మంది సభ్యులున్నారు. ఒక 20 మందిని తమ వైపుకి లాక్కుంటే రాజస్తాన్‌ కూడా బీజేపీ పరమవుతుంది.

>
మరిన్ని వార్తలు