బుర్ఖాపై నిషేధం విధించాలి : శివసేన

1 May, 2019 14:55 IST|Sakshi

న్యూఢిల్లీ : శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో బుర్ఖాలతో సహా ముఖాన్ని కవర్‌ చేసుకునేందుకు ఉపయోగించే దుస్తులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మన దేశంలో కూడా బుర్ఖా ధరించి బయటకు రావడాన్ని నిషేధించాలంటూ శివసేన పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలో పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఈ విషయం గురించి ప్రచురించింది. అంతేకాక ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే సర్జికల్‌ దాడులు చేసిన దానికన్నా ఎక్కువ ధైర్యం కావాలంది. లంకలో బుర్ఖాలపై నిషేధం విధించారు.. మరి అయోధ్యలో ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు మోదీ అంటూ ప్రశ్నించింది.

అయితే శివసేన డిమాండ్‌ను పలువురు బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. సేన డిమాండ్‌పై స్పదించిన బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నర్సింహ్మ రావు.. భారతదేశంలో ఇలాంటి నిషేధం అవసరం లేదని స్పష్టం చేశారు. మరో కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే మాట్లాడుతూ.. ‘బుర్ఖా ధరించే ముస్లిం మహిళలంతా ఉగ్రవాదులు కారు. ఇది వారి సంప్రదాయం. దాన్ని గౌరవించాలి. భారతదేశంలో బుర్ఖాలపై నిషేధం అనవసరం’ అన్నారు. అయితే సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ మాత్రం సేన డిమాండ్‌ను సమర్థించారు. కొన్ని నిర్ణయాలను దేశ రక్షణ కోసం తీసుకుంటాము. ఇలాంటి వాటిని అందరు తప్పక పాటించాలన్నారు.

వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌ వాసిమ్‌ రిజ్వీ కూడా ఈ డిమాండ్‌ను వ్యతిరేకించారు. ‘ఇది ముస్లిం మహిళలకు సంబంధించిన నిర్ణయం. బుర్ఖా ధరించాలా వద్దా అనేది వారి ఇష్టం. అంతేతప్ప దేశ వ్యాప్తంగా బుర్ఖాను నిషేధించడం అనేది బాధ్యతారహితమైనదే కాక రాజ్యంగ విరుద్ధమైన డిమాండ్‌’ అంటూ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు