-

త్రిపుర మాదిరే ఇక్కడా వస్తాం

12 Mar, 2018 02:53 IST|Sakshi

బీజేపీని ప్రజలు ఆశీర్వదించాలి: కేంద్రమంత్రి హన్స్‌రాజ్‌

అధికారంలోకి వస్తే నిజాం చక్కెర పరిశ్రమ తెరిపిస్తాం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: త్రిపుర వంటి రాష్ట్రాల మాదిరే తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్రమంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్‌ అన్నారు. తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్యవంతులని, బీజేపీని ఆశీర్వదించాలని కోరారు. నిజాం చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాల్లో బీజేపీ చేపట్టిన పాదయాత్ర ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా బోధన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

ఉమ్మడి రాష్ట్రంలో తామెప్పుడూ అధికారంలో లేమని, అయినా రాష్ట్రాభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నిజాం చక్కెర పరిశ్రమను పునఃప్రారంభించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రాంతం కూతురుది.. అల్లుడిది కాదంటూ టీఆర్‌ఎస్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు.

ప్రైవేటు పరిశ్రమలకు లాభం చేకూర్చేందుకే కాంగ్రెస్‌ సర్కారు పలు ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూసివేసిందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ సర్కారు సైతం ఇదే ధోరణితో ముందుకెళ్తోందన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు గతంలో అనుమతులు లభించలేదని, మోదీ హయాంలో అనుమతులు ఇచ్చామని వివరించారు.

ఐడీపీఎల్‌ను తెరిపిస్తాం
తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లోని ఐడీపీఎల్‌ పరిశ్రమను తెరిపిస్తామని హన్స్‌రాజ్‌ చెప్పారు. ఇప్పటికే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించేందుకు రూ.550 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. మేకిన్‌ ఇండియా నినాదంతో ఉపాధి అవకాశాలను పెంపొందించడమే కాకుండా దేశంలో ఉత్పాదకతను పెంచేందుకు కృషి జరుగుతోందన్నారు. పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యానికి ఒక్కో కిలోకు రూ.27 చొప్పున కేంద్రమే సబ్సిడీ భరిస్తోందని చెప్పారు.

తమ ప్రభుత్వం 2022 నాటికి నిరుపేదలందరికీ పక్కా గృహాలు ఉండేలా చర్యలు చేపట్టిందన్నారు. నిరుపేదలకు రూ.3.50 లక్షలతో వైద్య బీమా పథకం అమలుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సభలో పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, నాయకులు ధర్మపురి అర్వింద్, యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు