మున్సిపాలిటీలపై ‘కమలం’ కన్ను    

11 Jul, 2019 12:36 IST|Sakshi

పురపోరులో విజయమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం 

ఇతర పార్టీల్లోని అసంతృప్తులను ఆదరించే ఎత్తుగడ 

సాక్షి, వికారాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికలపై బీజేపీ దృష్టి పెట్టింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పాగా వేయాలని ఆ పార్టీ భావిస్తోంది. గత పురపాలక ఎన్నికల్లో.. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో కేవలం రెండు కౌన్సిలర్‌ స్థానాలకే పరిమితమై..  పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈసారి పట్టణ ఓటర్లు, యువత బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓట్లు వచ్చాయి. దీనిని తమకు అనుకూలంగా మలుచుకుని మున్సిపాలిటీల్లో పాగా వేయాలని ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి మూడు ఎంపీ సీట్లు దక్కాయి.

దీనికితోడు కేంద్రంలో కమలనాథులు అధికారంలోకి వచ్చారు. దీంతో ఆ పార్టీ ప్రజల్లోకి మరింతగా చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా గతంలోకన్నా ఎక్కువగా సభ్యత్వ నమోదుపై దృష్టి సారించింది. జిల్లాలో ఇటీవల డీకే అరుణ పర్యటించి సభ్యత్వ నమోదును ప్రారంభించారు. అలాగే మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ నాయకత్వం ఓవైపు సభ్యత్వ నమోదు చేపడుతూనే మరోవైపు మున్సిపల్‌ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌ త్వరలో జిల్లా నాయకులతో సమావేశం కానున్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో వీలైనన్ని ఎక్కువ వార్డుల్లో గెలవాలన్నది బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందుకోసం ద్విముఖ వ్యూహంతో ముందుకువెళ్లాలని యోచిస్తోంది. వార్డుల్లో బలమైన నాయకులను గుర్తిస్తూనే మరోవైపు ఇతర పార్టీల్లో బలమైన నాయకులను గుర్తించి తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది.

ఇందులో భాగంగానే మున్సిపల్‌ ఎన్నికల కోసం ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్‌చార్జ్‌ను నియమించనుంది. రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు లేదా మాజీ ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. రాబోయే వారం రోజుల్లో ఇన్‌చార్జ్‌ల నియామకం పూర్తి కానున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. అలాగే ఈనెల 14 లేదా 15వ తేదీన మున్సిపాలిటీల్లోని నాయకులు, కార్యకర్తలతో బీజేపీ నాయకులు సమావేశం నిర్వహించనున్నారు.  

వ్యతిరేకత కలిసొచ్చేనా.. 
ప్రభుత్వ వ్యతిరేకత మున్సిపల్‌ ఎన్నికల్లో తమకు కలిసివస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తమ పాలనలో మున్సిపాలిటీలను అభివృద్ధి చేయలేదని, తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో లబ్ధిపొందాలని భావిస్తోంది. అలాగే యువ ఓటర్లపైనా ఆశలు పెట్టుకుంది. ఇటీవల బీజేపీ పట్ల యువత ఆకర్శితులు అవుతున్నారు. దీంతో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఉన్న యువ ఓటర్లను టార్గెట్‌గా చేసుకుని ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు కాషాయ నేతలు ప్రణాళిక రచిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు