ఇదీ బీజేపీ ప్రణాళిక!

16 May, 2018 01:43 IST|Sakshi

అహిందాకు దీటుగా ఓటర్ల ఆకర్షణ

ఆరెస్సెస్‌ సాయంతో క్షేత్రస్థాయిలో కార్యాచరణ

దేశమంతా ఇదే వ్యూహంతో దూసుకెళ్తున్న కమలదళం  

కర్ణాటకలో గత ఎన్నికల్లో 40 సీట్లలో గెలిచిన బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు దగ్గరకు రావటానికి చాలా కష్టపడింది. కాంగ్రెస్‌ అహిందా వ్యూహానికి దీటుగా ఓటర్లను తమవైపునకు ఆకర్షించటంలో బీజేపీ, ఆరెస్సెస్‌ పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాయి.

సాంస్కృతిక జాతీయవాదం పేరుతో దాదాపు వేల మంది ఆరెస్సెస్‌ కార్యకర్తలు రాష్ట్రంలోని 56వేల పోలింగ్‌ కేంద్రాల బాధ్యతలను తీసుకున్నారు. వీరంతా తమకు అనుకూలంగా ఉండే పోలింగ్‌బూత్‌కు ఓటర్లను రప్పించే బాధ్యతను తీసుకోవటం బీజేపీ సీట్ల సంఖ్య పెరగటానికి కారణమైంది. కర్ణాటక కాకుండా బయట రాష్ట్రాలనుంచి కూడా దాదాపు 50వేల మంది స్వయం సేవకులు కర్ణాటకలో పనిచేశారు.

మోదీ దూకుడు: రాష్ట్రవ్యాప్తంగా మోదీ ఎన్నికల ర్యాలీలు 15వరకుంటాయని మొదట నిర్ణయించారు. ప్రధాని ప్రచారం దూకుడుగా సాగటం, ప్రజల్లో స్పందనను గమనించిన పార్టీ ముఖ్య నేతలు ఈ ర్యాలీల సంఖ్యను 21కి పెంచారు. బీజేపీ అభద్రతాభావానికి గురై ఈ నిర్ణయం తీసుకుందని విపక్షాలు, రాజకీయ విశ్లేషకులు అనుకున్నారు. అయితే, మోదీ రెండు రాత్రులు బెంగుళూలో బసచేసి అదనంగా 6ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడం బీజేపీకి పోలింగ్‌కు రెండు రోజులు ముందు మంచి ఊపునిచ్చింది.

ప్రధాని ర్యాలీలు చివరి క్షణం వరకూ ఎటూ తేల్చుకోని ఓటర్లను బీజేపీ వైపు మళ్లించాయి. అప్పటి వరకూ కాంగ్రెస్‌కే మొగ్గు ఉందని అంచనావేసిన మీడియా కూడా మోదీ సభలు, ప్రసంగాలతో బీజేపీ విజయావకాశాలూ పెరిగాయని చెప్పింది. ర్యాలీలు జరిపి ప్రాంతాల ప్రముఖులు, సాంఘిక, ధార్మిక నేతల మాటను ప్రధాని ఉటంకిస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. లింగాయత్‌ ధర్మ స్థాపకుడైన బసవన్న ప్రవచనాలతో కన్నడ ప్రజలకు దగ్గరయ్యారు.

మోదీ+షా+ఆరెస్సెస్‌= బీజేపీ
నాలుగేళ్లుగా బీజేపీ దేశవ్యాప్త విస్తరణ రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు, సిద్ధాంతపరమైన భావజాలాన్ని, మద్దతును అందించే ఆరెస్సెస్‌ వెన్నుదన్ను, ఎన్నికల సందర్భంగా అనుసరించే పకడ్బందీ ప్రచారవ్యూహాలు, ప్రధాన నరేంద్ర మోదీ సమ్మోహనశక్తి, అమిత్‌షా వ్యూహాలలు వెరసి బీజేపీ సర్వశక్తిమంతంగా తయారైంది.

నాలుగేళ్లుగా సానుకూల పురోగతి
2014కు ముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటకీ.. ఆ తర్వాతి కాలంలో తన పట్టును దేశవ్యాప్తంగా పెంచుకుంది.  2014 మే తర్వాత 20 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 రాష్ట్రాలను బీజేపీ గెలుచుకుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో, దాదాపు పాతికేళ్ల పాటు సీపీఎంకు కంచుకోటగా ఉన్న త్రిపురలోనూ బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

హరియాణా, మహారాష్ట్ర (శివసేనతో కలిసి), జార్ఖండ్‌లలో మొదటిసారిగా బీజేపీ అధికారం చేపట్టింది. జమ్మూకశ్మీర్‌లో పీడీపీతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామిగా మారింది. ఢిల్లీలో ఓడినా.. బిహార్‌లో కాస్త ఆలస్యంగానైనా నితీశ్‌తో కూటమికట్టింది. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది.  ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్‌లలో బీజేపీ అధికారాన్ని సాధించింది.

మరిన్ని వార్తలు