కర్ణాటకలో ‘ఈశాన్య’ మంత్రం

29 Apr, 2018 02:53 IST|Sakshi

గిరిజనులను ఆకర్షించేందుకు బీజేపీ వ్యూహం

శ్రీరాములు ఎంపికకు కారణమదే!

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు సరికొత్త వ్యూహాలతో పోరును రసవత్తరంగా మార్చేస్తున్నాయి. గిరిజనుల విషయంలో బీజేపీ దూకుడుగా వెళ్తోంది. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే బీజేపీ కర్ణాటకలోనూ అమలు చేస్తోందా? అక్కడి మాదిరిగానే కన్నడనాట కూడా గిరిజన అనుకూల కార్డును ప్రయోగిస్తోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

లోక్‌సభ ఎంపీ బి.శ్రీరాములును కర్ణాటకలో తమ ప్రధాన ప్రచారకర్తగా ఎంపిక చేయడమే దీనికి నిదర్శనమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గిరిజనుల్లో ఎంతో పలుకుబడి ఉన్న శ్రీరాములును బరిలోకి దింపడం ద్వారా గిరిజన ఓట్లు తమకే పడతాయని బీజేపీ ఆశిస్తోంది. వాల్మీకి నాయక్‌ తెగకు చెందిన శ్రీరాములును అందుకే తమ ప్రధాన ప్రచారకర్తగా ఎంచుకుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సందీప్‌ శాస్త్రి అన్నారు. గనుల వ్యాపారి గాలి జనార్దన్‌ రెడ్డికి సన్నిహితుడైన శ్రీరాములు సీఎం సిద్దరామయ్యకు వ్యతిరేకంగా బాదామిలో పోటీ చేస్తున్నారు.

జనాభా తక్కువే ..అయినా కీలకమే
జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో మాదిరిగా కర్ణాటకలో గిరిజన జనాభా ఎక్కువ లేకున్నా పోటీ తీవ్రత దృష్ట్యా వారి ఓట్లు కూడా కీలకం అవుతాయని భావిస్తున్నారు. కేవలం 15–20 నియోజక వర్గాల్లోనే గిరిజనుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఉత్తర కర్ణాటకలో గిరిజన ఓట్లు గెలుచుకోవడం బీజేపీకి కష్టమే అని కర్ణాటక వర్సిటీ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు హరీశ్‌ రామస్వామి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌–కర్ణాటక, చిత్రగూడల్లో శ్రీరాములుకు పలుకుబడి ఉందని, అయినా గిరిజన ఓట్లను కొల్లగొట్టడం శ్రీరాములుకు కత్తిమీద సామేనన్నారు.

గిరిజన ఓటర్లు బీజేపీ వైపు ఆకర్షితులయ్యేలా పనిచేసే బృందం శ్రీరాములుకు అవసరమని అన్నారు. గిరిజన ఓట్లు క్రమంగా కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి బదిలీ అవుతున్నట్లు జైన్‌–లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ సర్వేలో తేలిందని సందీప్‌ శాస్త్రి చెప్పారు. మైసూర్, చామ్‌రాజ్‌నగర్, బాగల్‌కోట్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న గిరిజనులను తనవైపు తిప్పుకోగలమని బీజేపీ భావిస్తోందని అన్నారు. దళితులు, గిరిజనులకు వేర్వేరు వ్యూహాలు అమలుచేస్తున్న ఏకైక పార్టీ బీజేపీయే అని తెలిపారు. ఇలా రెండు భిన్న వ్యూహాల ద్వారా ఆ పార్టీ ఇప్పటికే విజయవంతమైందని అన్నారు. అయితే దళితుల మాదిరిగా గిరిజనులపై హిందూత్వ అజెండాను ప్రయోగించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. దళితులతో పోల్చితే గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు పూర్తి భిన్నంగా ఉండటమే ఇందుకు కారణమని వివరణ ఇచ్చారు.


బరిలో 2,655 మంది
ముగిసిన నామినేషన్ల పర్వం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం శనివారంతో ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 2,655 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 219 మంది మహిళలు ఉన్నారు. కోలార్‌ జిల్లాలోని ముళబాగిలు నియోజకవర్గంలో అత్యధికంగా 39 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, చిత్రదుర్గ జిల్లాలోని చెళ్లకెరె నుంచి అత్యల్పంగా నలుగురు మాత్రమే పోటీ పడుతున్నారు. ఎన్నికల సంఘం(ఈసీ) విడుదల చేసిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 3,509 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేయగా, శనివారం నాటికి 583 మంది ఉపసంహరించుకున్నారు. 271 మంది అభ్యర్థుల నామినేషన్లను ఈసీ వివిధ కారణాలతో తోసిపుచ్చింది.  మొత్తం 224 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ 222 చోట్ల పోటీ చేస్తుండగా, బీజేపీ అన్ని చోట్లా, జేడీఎస్‌ 201 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాయి.  

మరిన్ని వార్తలు