గాంధీనగర్‌లో నామినేషన్‌ వేసిన అమిత్‌ షా

30 Mar, 2019 12:09 IST|Sakshi
బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాను సత్కరిస్తోన్న నాయకులు

అహ్మదాబాద్‌(గుజరాత్‌): బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌ షా ఈరోజు(శనివారం) గాంధీనగర్‌ లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన తన భార్య, కుమారుడితో కలిసి నామినేషన్‌ వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ‘బూత్‌ స్థాయి కార్యకర్త నుంచి ఈ స్థాయికి వచ్చేందుకు చాలా కష్టపడ్డా. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయం లేదు. ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది.’ అని అన్నారు. అమిత్‌ షా   నామినేషన్‌ వేయడానికి ముందు భారత ఉప ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  నామినేషన్‌ కార్యక్రమంలో ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాక్రే, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు పలువురు బీజేపీ అగ్రనాయకులు పాల్గొన్నారు.  

అమిత్‌ షా నామినేషన్‌ కార్యక్రమ విజువల్స్‌
రాజ్యసభ సభ్యుడైన అమిత్‌ షా తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గతంలో గాంధీనగర్‌ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అడ్వాణీ ఈ రోడ్‌షోలో ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం బీజేపీలో నరేంద్ర మోదీ తర్వాత అమిత్‌ షానే పవర్‌పుల్‌ వ్యక్తి కావడంతో బీజేపీ అగ్రనాయకులంతా నామినేషన్‌ కార్యక్రమానికి తరలివచ్చారు. అడ్వాణీ గాంధీ నగర్‌ స్థానం నుంచి 6 సార్లు వరసగా గెలిచారు. 1991లో జీఐ పటేల్‌ మీద 1.25 లక్షల మెజారిటీతో అడ్వాణీ గెలిచారు. 2014లో ఇదే స్థానం నుంచి అడ్వాణీ 4 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీ గెలిచారు. ఈసారి 75ఏళ్లు పైబడిన వారికి ఎంపీ సీట్లు కేటాయించడానికి బీజేపీ అదిష్టానం నిరాకరించడంతో అడ్వాణీకి మొండిచేయి చూపినట్లుగా తెలిసింది. 26 ఎంపీ స్థానాలున్న గుజరాత్‌లో నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల్‌ 4. గుజరాత్‌లో ఓటింగ్‌ ఏప్రిల్‌ 23న జరగనుంది.

మరిన్ని వార్తలు