ఆ విషయం కేసీఆర్‌కు తెలుసు: అమిత్‌ షా

15 Sep, 2018 13:41 IST|Sakshi
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా

హైదరాబాద్‌: కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా డిమాండ్‌ చేశారు. తెలంగాణ పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ప్రజలపై భారం పడకుండా ఉండేదన్నారు.

‘దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పరిపాలన అందించారు. ఒకే దేశం.. ఒకే ఎన్నికలు విధానాన్ని కేసీఆర్‌ ముందు సమర్ధించి ఆ తర్వాత మాట మార్చారు. 9 నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. చిన్న రాష్ట్రం మీద రెండు సార్లు ఎన్నికల భారం అవసరమా? తెలంగాణా ప్రజల మీద వేల కోట్ల రూపాయల భారం వేశారు. బీజేపీకి ప్రజల మద్ధతు పెరిగింది. కేసీఆర్‌కు జనం మద్ధతు లేదు. తెలంగాణను మళ్లీ రజాకార్ల పాలనలో పెడతారా.. ప్రజలు ఆలోచించాలి. సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు చేయడం లేదు? మజ్లిస్‌కు భయపడే నిర్వహించడం లేదు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని కేంద్రానికి పంపారు. కేసీఆర్‌కు తెలుసు... బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదని.. అయినా బిల్లు పంపారు. కేసీఆర్‌ వస్తే మళ్లీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తార’ని  అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

ఇంకా మాట్లాడుతూ.. ‘తెలుగు నేతలు అంజయ్య, పీవీ నర్సింహారావులను కాంగ్రెస్‌ పార్టీ ఏవిధంగా అవమానించిందో అందరికీ తెలుసు. కనీసం 2018లో అయినా దళితుడిని సీఎం చేస్తారా చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరించాం. కొత్త జిల్లాల ఏర్పాటు అయ్యాక ఒక్క జిల్లా అయినా అభివృద్ధి చెందిందా? ఖమ్మం జిల్లాలో రైతులకు ఈ సర్కార్‌ బేడీలు వేసింది. రైతులకు బీజేపీ మద్ధతు ధర పెంచింది. సిరిసిల్లలో దళితుల మీద దాష్టీకం జరిగింది. 14వ ఆర్ధిక సంఘం నుంచి వచ్చిన నిధులు దుర్వినియోగం అయ్యాయ’ని ఆరోపించారు.

‘ఓబీసీలకు కాంగ్రెస్‌ సర్కార్‌ మోసం చేస్తే మోదీ న్యాయం చేశారు. కాంగ్రెస్‌ ఎందుకు రాజ్యసభలో ఓబీసీ బిల్‌ ఆపింది. ట్రైబల్‌, వెటర్నరీ, జయశంకర్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేశాం. ఎయిమ్స్‌కు రూ.1200 కోట్లు ఇచ్చాం. కాంగ్రెస్‌ సర్కార్‌ కన్నా 20 రెట్లు అధికంగా తెలంగాణకు ఇచ్చాం. తెలంగాణలో బీజేపీ సర్కార్‌ లేకపోయినా ఫెడరల్‌ స్ఫూర్తికి గౌరవం ఇచ్చాం. తెలంగాణ అభివృద్ధి కోసం గ్రామాల్లో తిరుగుతాం. కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. బీజేపీకి తెలంగాణ ప్రజల మద్ధతు కావాలి. రాష్ట్రంలో, కేంద్రంలో మోదీ సర్కారు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నార’ని అమిత్‌ షా తెలిపారు. సాయంత్రం మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొంటారు.

మరిన్ని వార్తలు