నిజాంను మరిపిస్తున్న కేసీఆర్‌

5 Jul, 2018 12:02 IST|Sakshi
సుల్తానాబాద్‌లో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌

పెద్దపల్లిరూరల్‌/సుల్తానాబాద్‌(పెద్దపల్లి): తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పాలన నిజాం పాలనను మరిపిస్తోందని , సీఎం కేసీఆర్‌ ఫాం హౌస్‌ నుంచి చేస్తున్న రాష్ట్రాన్ని పాలిస్తు అప్పులపాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. భారతీయ జనతాపార్టీ చేపట్టిన ప్రజాచైతన్య బస్సుయాత్ర బుధవారం పెద్దపల్లి, సుల్తానాబాద్, గర్రెపెల్లిమీదుగా కరీంనగర్‌కు వెళ్లింది. పెద్దపల్లి శాంతినగర్‌లో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి పార్టీ శ్రేణులు చేపట్టిన బైక్‌ర్యాలీ బస్టాండ్, ప్రగతినగర్, అమర్‌నగర్, శివాలయం, మెయిన్‌రోడ్, జెండా చౌరస్తా, కమాన్‌ల మీదుగా సాగింది. బస్సుయాత్ర శివాలయం ప్రాంతానికి చేరగా అక్కడ పలువురికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ కండువాలు కప్పి ఆహ్వానించారు. పట్టణ అధ్యక్షుడు కొంతం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఠాకూర్‌రాంసింగ్, పుట్టమొండయ్య తదితరులు లక్ష్మణ్‌ను సన్మానించారు.

మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఫహీం లక్ష్మణ్‌ చేతికి రక్ష కట్టారు. జెండా కూడలిలో మత్స్యకారులు చేపలు బహూకరించారు. బస్సుయాత్ర పెద్దపల్లికి చేరినా మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి బస్సు పైకి పిలిచేదాకా ఎక్కకపోవడం చర్చనీయాంశమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఇతర నాయకులు గుజ్జుల రామకృష్ణారెడ్డి బస్సుపైకి రావాలంటూ పదేపదే కోరారు. అయితే ఇదే బస్సుపై ఈ నియోజకవర్గానికే చెందిన దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ ఉండడంతో అలకబూనారని పలువురు చర్చించుకుంటున్నారు. అంతకు ముందే దుగ్యాల ప్రదీప్‌రావు మద్దతుదారులు బస్సుపై ఉన్న లక్ష్మణ్‌కు గొంగడితో సత్కరించారు. సుల్తానాబాద్‌లో రోడ్‌షోను ఉద్దేశించి లక్ష్మణ్‌ మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌ మాటలతో గారడి చేస్తున్నారే తప్ప ఆచరణలో శూన్యమని అన్నారు. కాళేశ్వరం, ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్ట్‌లతో కాంట్రాక్టర్లు లాభపడుతున్నారని అందులో నుంచి పర్సెంటేజిలతో టీఆర్‌ఎస్‌ నాయకులు లాభపడుతున్నారని ఆరోపించారు. నేరెళ్ల దళితుల చిత్ర హింసలు నేటికి మర్చిపోలేమని అన్నారు. గడిల రాజ్యాన్ని కూలదోసి గరీబోళ్ల రాజ్యం తీసుకురావడానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో మజ్లీస్‌ పార్టీని టీఆర్‌ఎస్‌ పెంచి పోషిస్తుందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, బోర్‌ బావులు ఉచితంగా వేయించడం, అప్పుల మీద వడ్డీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దళితులను మఖ్యమంత్రి చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్‌ నేడు రాజభోగాలను అనుభవిస్తూ ఎన్నికల హామీలైన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, నాణ్యమైన విద్య, ఎక్కడ అమలు అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య, మాజీ అధ్యక్షుడు అర్జున్‌రావు, సంజీవరెడ్డి, కోట రాంరెడ్డి, కొమ్ము తిరుపతియాదవ్, కేశవరావు, కరుణాకర్, రాజేంద్ర ప్రసాద్, మహేందర్, నారాయణ, శైలేందర్, శ్రీనివాస్‌ రెడ్డి, పిన్నింటి రాజు, కోట నాగేశ్వర్, బాపు, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
 
ర్యాలీలో అపశ్రుతి
బీజేపీ మండల మాజీ కార్యదర్శి వేగోళం శ్రీనివాస్‌గౌడ్‌ బైక్‌ ర్యాలీలో సుల్తానాబాద్‌ బస్టాండ్‌ సమీపంలో వెనుక నుంచి మరో వాహనం ఢీకొనడంతో బైక్‌ బోల్తాపడింది. దీంతో శ్రీనివాస్‌ గౌడ్‌ భుజానికి గాయమైంది. కార్యకర్తలు హుటాహుటిన ప్రైవేట్‌ వాహనంలో కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు