సంకీర్ణానికి బీజేపీ రాం..రాం

20 Jun, 2018 01:41 IST|Sakshi

జమ్మూ కశ్మీర్‌లో ముగిసిన పీడీపీ–బీజేపీ కూటమి పాలన

సీఎం పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా

సంకీర్ణంలో కొనసాగలేం.. గవర్నర్‌ పాలన తప్పనిసరి: బీజేపీ

న్యూఢిల్లీ/శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో పీడీపీ–బీజేపీ సంకీర్ణ కూటమి పాలన ముగిసింది. ప్రభుత్వం నుంచి తాము వైదొలగుతున్నామని బీజేపీ ప్రకటించడంతో.. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేశారు. రంజాన్‌ సందర్భంగా కశ్మీర్‌లో కేంద్రం ప్రకటించిన కాల్పుల విరమణ.. తదనంతర పరిణామాలు మూడేళ్ల పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికే ఎసరుపెట్టాయి.

కశ్మీర్‌లో కాల్పుల విరమణ ఆదివారంతో ముగిసిందని కేంద్ర హోం మంత్రి ప్రకటించగా.. దానిని పొడిగించాలని పీడీపీ డిమాండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ, శ్రీనగర్‌లో పరిణామాలు చకచకా మారిపోయాయి. కశ్మీర్‌ ప్రభుత్వంలోని బీజేపీ మంత్రుల్ని అత్యవసరంగా ఢిల్లీ రప్పించిన అధిష్టానం.. వారితో చర్చలు కొనసాగించింది.

అనంతరం బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ ప్రకటన చేస్తూ.. పీడీపీతో పొత్తు నుంచి బీజేపీ వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అనంతరం కొద్ది గంటలకు  జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రాను కలిసిన సీఎం మెహబూబా రాజీనామాను సమర్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గవర్నర్‌ పాలన తప్పనిసరని పేర్కొంటూ రాష్ట్రపతికి గవర్నర్‌ నివేదిక పంపారు. నేడో రేపో గవర్నర్‌ పాలనపై రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలు వెలువరించే అవకాశముంది.  

రాష్ట్రంలో సంకీర్ణ కూటమిలో కొనసాగడం ఇక సాధ్యం కాదని, గవర్నర్‌ పాలన తప్పనిసరని రాం మాధవ్‌ చెప్పగా.. బీజేపీ నిర్ణయం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని పీడీపీ పేర్కొంది. పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం వైదొలిగిన నేపథ్యంలో.. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ), కాంగ్రెస్‌లు స్పష్టం చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్‌ పాలనే ఉత్తమమని ఎన్‌సీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా గవర్నర్‌కు సూచించారు.

ఒకవేళ జమ్మూ కశ్మీర్‌లో గవర్నర్‌ పాలన విధిస్తే.. 1977 నుంచి ఇది ఎనిమిదోసారి అవుతుంది. 2008 నుంచి నాలుగుసార్లు ఆ రాష్ట్రంలో గవర్నర్‌ పాలన కొనసాగింది. 89(ఇద్దరు నామినేటెడ్‌తో కలిపి) సభ్యులున్న కశ్మీర్‌ అసెంబ్లీలో బీజేపీకి 25 స్థానాలు, పీడీపీకి 28, నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు 15, కాంగ్రెస్‌కు 12, ఇతరులకు ఏడు స్థానాలున్నాయి.

డిసెంబర్‌ 2014లో ఎన్నికలు జరగగా.. మార్చి, 2015లో పీడీపీ, బీజేపీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నిజానికి ఆ ఎన్నికల్లో పీడీపీ, బీజేపీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నప్పటికీ.. రాష్ట్రంలో హింసకు ముగింపు పలకాలన్న లక్ష్యంతో ఒక్కటయ్యాయి. సంకీర్ణ ప్రభుత్వ పాలన ప్రారంభం నుంచి ఇరు పార్టీలు అనేక అంశాలపై విభేదించాయి.  

శాంతి భద్రతల్లో పీడీపీ విఫలం: బీజేపీ
ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షాతో చర్చించిన అనంతరం కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నామని రాం మాధవ్‌ వెల్లడించారు. ‘కశ్మీర్‌ లోయలో భద్రతా పరిస్థితుల్ని మెరుగుపర్చడంలో పీడీపీ విఫలమైంది. రాష్ట్రీయ రైఫిల్స్‌ జవాను ఔరంగజేబు, రైజింగ్‌ కశ్మీర్‌ ఎడిటర్‌ షుజాత్‌ బుఖారీల హత్య ఘటనలే అందుకు ఉదాహరణ. జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం. అక్కడి హింసాత్మక పరిస్థితుల్ని అదుపు చేయడమే లక్ష్యంగా అధికారాల్ని గవర్నర్‌కు అప్పగించాలని మేం నిర్ణయించాం’ అని చెప్పారు.

కశ్మీర్‌లో ఉగ్రవాదం, హింస, తిరుగుబాట్లు పెరిగిపోయాయని,  జీవించే హక్కు, వాక్‌స్వాతంత్య్రం మొదలైన ప్రాథమిక హక్కులు ప్రమాదంలో ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘కశ్మీర్‌ లోయలో ప్రశాంతత, అభివృద్ధి కోసం కేంద్రం సాధ్యమైనదంతా చేసింది. పాకిస్తాన్‌ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు ముగింపు పలికేందుకు ప్రయత్నించాం. అయితే పీడీపీ తన వాగ్దానాల్ని నెరవేర్చడంలో విఫలమైంది.

జమ్మూ, లడఖ్‌ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల విషయంలో బీజేపీ నేతలు పీడీపీ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీడీపీ ఉద్దేశాల్ని మేం ప్రశ్నించడం లేదు. అయితే కశ్మీర్‌లో పరిస్థితుల్ని మెరుగుపర్చడంలో వారు విఫలమయ్యారు’ అని రాం మాధవ్‌ పేర్కొన్నారు. సంకీర్ణ సర్కారులోని బీజేపీ మంత్రులు గవర్నర్‌తో పాటు, సీఎంకు తమ రాజీనామాల్ని సమర్పించారని డిప్యూటీ సీఎం, బీజేపీ నేత కవిందర్‌ గుప్తా వెల్లడించారు.  

చర్చలతోనే పరిష్కారం: మెహబూబా
బలప్రయోగంతో కూడిన భద్రత రాష్ట్రంలో ఫలితం ఇవ్వదని, చర్చలే పరిష్కారమని మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. రాజీనామా సమర్పించాక తన నివాసంలో పార్టీ మంత్రులు, కార్యకర్తలతో ఆమె చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘అధికారం కోసం బీజేపీతో జట్టుకట్టలేదు. ప్రజల కోసమే పనిచేశాం. ఇక ఏ పార్టీతోను పీడీపీ పొత్తు పెట్టుకోదని గవర్నర్‌కు స్పష్టం చేశాను’ అని చెప్పారు. పాకిస్తాన్, జమ్మూ కశ్మీర్‌ ప్రజలతో చర్చలు జరపాలన్న పీడీపీ ఎజెండాకు ప్రత్యామ్నాయం లేదని అన్నారు.  

చేసిందంతా చేసి...: కాంగ్రెస్‌
పీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. ఆర్థికంగా, సామాజికంగా రాష్ట్రాన్ని పీడీపీ–బీజేపీ కూటమి నాశనం చేసిందని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఆజాద్‌ విమర్శించారు. ‘ఈ మూడేళ్లలో కశ్మీర్‌ను ఎంత వీలైతే అంత బీజేపీ నాశనం చేసి ఇప్పుడు పక్కకు తప్పుకుంది. గత మూడేళ్లలో  373 మంది జవాన్లు, 239 పౌరులు ప్రాణాలు కోల్పోయారు’ అని ఆయన చెప్పారు. పీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా బీజేపీ భారీ తప్పిదానికి పాల్పడిందని నాడే రాజ్యసభలో ప్రధా ని మోదీని హెచ్చరించానని గుర్తు చేశారు.

మరో ప్రత్యామ్నాయం లేదు: ఒమర్‌
‘2014 ఎన్నికల్లో ఎన్‌సీకి మెజార్టీ దక్కలేదు. అందువల్ల ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్యా బలం మాకు లేదని గవర్నర్‌కు చెప్పాను. ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు ప్రయత్నాలు చేయడం లేదనీ స్పష్టం చేశాను. ఏ పార్టీకి మెజార్టీ లేనందున గవర్నర్‌ పాలన విధించడం మినహా ప్రత్యామ్నాయం లేదని కూడా వివరించాను’ అని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు.

రాష్ట్రపతికి నివేదిక
జమ్మూ కశ్మీర్‌లో గవర్నర్‌ పాలన విధించాల్సిందిగా కోరుతూ ఆ రాష్ట్ర గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఓ నివేదిక పంపారు. రాష్ట్రం లోని అన్ని రాజకీయ పక్షాలతో చర్చలు జరిపిన అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో గవర్నర్‌ పాలనకు వోహ్రా సిఫారసు చేశారు.

మెహబూబా ముఫ్తీతోపాటు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు రవీందర్‌ రైనా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన ఒమర్‌ అబ్దుల్లా, కాంగ్రెస్‌ రాష్ట్రాధ్యక్షుడు జీఏ మిర్‌లతో వోహ్రా మాట్లాడారు. తగినంత సంఖ్యాబలం లేని కారణంగా ఎవ్వరూ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేదు.  

అనూహ్యం.. ఆశ్చర్యకరం!
శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌ సీఎంగా మెహబూబా ముఫ్తీ ప్రయాణం అర్ధాంతరంగా, ఆకస్మికంగా ముగిసింది. మంగళవారం ఉదయం కూడా ఆమె సాధారణంగా విధులకు హాజరై తన కార్యాలయంలో పనులు చేసుకున్నారు. అయితే మధ్యాహ్నం గవర్నర్‌ నుంచి వచ్చిన ఒక్క ఫోన్‌కాల్‌ పరిస్థితిని తారుమారు చేసింది.

మధ్యాహ్నం రెండు గంటలకు బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. జమ్మూ కశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలుగుతున్నట్లు అనూహ్యంగా ప్రకటించారు. ఆ వెంటనే బీజేపీ జమ్మూ కశ్మీర్‌ అధ్యక్షుడు రవీందర్‌ రైనా గవర్నర్‌ వోహ్రాకు లేఖ రాస్తూ తాము పీడీపీకి మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. బీజేపీ మంత్రుల రాజీనామా లేఖలను కూడా గవర్నర్‌కు పంపారు.

ఆ తర్వాత గవర్నర్‌ జమ్మూ కశ్మీర్‌ ప్రధాన కార్యదర్శి బీబీ వ్యాస్‌కు ఫోన్‌ చేసి, ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆ తర్వాత బీజేపీ నిర్ణయాన్ని గవర్నర్‌ ముఫ్తీకి తెలియజేయడంతో తాను రాజీనామా చేయనున్నట్లు ఆమె చెప్పారు. ఈ విషయంపై బీజేపీ వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని ఆమె గవర్నర్‌తో అన్నారు.


బీజేపీ–పీడీపీ కూటమి పాలన
♦  2014 డిసెంబర్‌ 28: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హంగ్‌. మొత్తం 87 స్థానాలకు గాను పీడీపీకి 28, బీజేపీకి 25 సీట్లు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు 15, కాంగ్రెస్‌కు 12 సీట్లు వచ్చాయి.
♦  డిసెంబర్‌ 28: రాష్ట్రంలో గవర్నర్‌ పాలన విధిస్తూ కేంద్రం ప్రకటన
♦  2015 మార్చి 1: బీజేపీ, పీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు. ముఫ్తీ మొహమ్మద్‌ సయీద్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.
♦  2016 జనవరి 7:  ముఫ్తీ మొహమ్మద్‌  సయీద్‌ అనారోగ్యంతో మృతి.
♦  2016 జనవరి 8: రాష్ట్రంలో మరోసారి గవర్నర్‌ పాలన విధింపు.
♦  2016 ఏప్రిల్‌ 4: మొదటి మహిళా సీఎంగా మెహబూబా ముఫ్తీ ప్రమాణ స్వీకారం.
♦  2016 ఏప్రిల్‌ 5: భారత్‌– పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా శ్రీనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో రాష్ట్ర, రాష్ట్రేతర విద్యార్థుల మధ్య గొడవ.
♦  2016 జూలై 8: హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌లో మృతి. ఈ ఘటనపై ప్రజాందోళనలు వెల్లువెత్తడంతో పీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు ప్రారంభం.
♦  2018 మే 9: ఎన్‌కౌంటర్‌లు జరిగిన ప్రాంతాల్లో ప్రజాందోళనల సందర్భంగా పోలీసు కాల్పుల్లో సామాన్యులు ప్రాణాలు కోల్పోవటంపై చర్చించేందుకు అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసిన సీఎం మెహబూబా. సమావేశం అనంతరం రంజాన్‌ సందర్భంగా కాల్పుల విరమణ ప్రకటించాలని కేంద్రాన్ని కోరిన సీఎం. వ్యతిరేకించిన డిప్యూటీ సీఎం కవీందర్‌ గుప్తా.
♦  మే 17: రంజాన్‌ను పురస్కరించుకుని నెల పాటు కాల్పుల విరమణ ప్రకటించిన కేంద్రం
♦ జూన్‌ 17: కాల్పుల విరమణను పొడిగించబోమని కేంద్రం ప్రకటన.
♦ జూన్‌ 18: రాష్ట్ర కేబినెట్‌లోని బీజేపీ మంత్రు లంతా ఢిల్లీకి రావాలన్న పార్టీ అధిష్టానం.
♦  జూన్‌19: సంకీర్ణం నుంచి వైదొలగిన బీజేపీ.

మరిన్ని వార్తలు