రాష్ట్రపతి పాలనా? బలపరీక్ష?

10 Jul, 2019 07:18 IST|Sakshi
కుమార సర్కారు దిగిపోవాలంటూ బెళగావిలో బీజేపీ శ్రేణుల ర్యాలీ

ఉత్కంఠభరితంగా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం  

మైనారిటీలో కుమార సర్కారు 

గవర్నర్‌ నిర్ణయమే కీలకం  

మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ రాజీనామా  

సాక్షి, బెంగళూరు:  తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన కన్నడనాట రాష్ట్రపతి పాలన తప్పదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  సుమారు 14 మంది కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్, గవర్నర్‌ తీసుకునే నిర్ణయంపైనే ప్రభుత్వ భవితవ్యం ఆధారపడి ఉంది. ఏ పార్టీకి స్పష్టమైన మద్దతు లేక పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ సిఫారసులు చేసే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్‌– జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం మనుగడ గాల్లో దీపంలా మారిపోయింది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే రాజీనామా చేస్తారో తెలియని గందరగోళం నెలకొంది. మంగళవారం శివాజీనగర కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రోషన్‌బేగ్‌ కూడా రాజీనామా చేశారు. 

గవర్నర్‌ ఏమంటారు?  
అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలను ఉపసంహరించుకునేలా కాంగ్రెస్‌ పార్టీ బుజ్జగింపులకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అలాగే రాజీనామాలతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూనే బీజేపీ లోలోపల తన కార్యాచరణను అమలు చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రుల రాజీనామాలు చేయడంతో సంకీర్ణం మైనారిటీలో జారిపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గవర్నర్‌ వజుభాయి వాలా కుమారస్వామి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బలపరీక్షకు ఆహ్వానిస్తారా లేక రాష్ట్రపతి పాలనకే సిఫార్సు చేస్తారా అనేది సస్పెన్స్‌గా మిగిలింది.

మైనారిటీలో కుమార సర్కారు  
224 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీకి 78, జేడీఎస్‌కు 37 మంది, బీజేపీకి 105 మంది,  బీఎస్పీ నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో అధికారపక్షానికి మొత్తం 119 ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రస్తుతం 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు, ఇద్దరు స్వతంత్రుల మద్దతు ఉపసంహరణతో ఆబలం 103కు క్షీణించింది.  సర్కారు ఏర్పాటుకు 113 మంది శాసనసభ్యుల బలముండాలి. గ తంలో పలు కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ముందుగా బలపరీక్షకు అధికార పక్షాల్ని గవర్నర్‌ ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ నిర్ణయమే కీలకంగా మారింది. 

బలపరీక్షకే సీఎం మొగ్గు  
బలపరీక్షకు సిద్ధంగా ఉండాలని సీఎం కుమారస్వామి యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 12న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. బలం చాటుకోవడానికి విశ్వాస పరీక్షను ఎదుర్కొవడమే ఉత్తమమని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వాస పరీక్ష సందర్భంగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు కూడా విప్‌ జారీ చేయవచ్చని, విప్‌కు భయపడి ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు పలుకుతారని భావిస్తున్నారు. ఒకవేళ విప్‌ను ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశ్వాస పరీక్షలో ఓటు వేస్తే సంబంధిత ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

సంకీర్ణానికే మహేశ్‌ మద్దతు  
నానాటికీ బలం కోల్పోతున్న సంకీర్ణ ప్రభుత్వానికి బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్‌.మహేశ్‌ మద్దతు ప్రకటించారు. మంగళవారం విధానసౌధ కార్యదర్శితో భేటీ అయి సర్కారుకు తన మద్దతు ఉంటుందని ప్రకటించి వెళ్లిపోయారు. 

నేడు ముంబైకి డీకేశి
ముంబైలో మకాం వేసిన అసంతృప్త కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు రాష్ట్ర మంత్రి డీకే శివకుమార్‌ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు.  బుధవారం డీకే శివకుమార్‌ బృందం అసంతృప్త ఎమ్మెల్యేల వద్దకు వెళ్లనుంది. వారు రెబెల్స్‌ను కలిసే అవకాశం లభిస్తుందా? అన్నది అనుమానమేనని తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా