వలస కూలీల నుంచి చార్జీలు వసూలు చేయలేదు..

4 May, 2020 18:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వలస కూలీలను ప్రత్యేక రైళ్ల ద్వారా తరలించడానికి అయ్యే ఖర్చును తమ పార్టీ భరిస్తుందని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ ప్రకటించిన క్రమంలో వలస కూలీల నుంచి ప్రభుత్వం ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. వలస కూలీల తరలింపు వ్యయంలో 85 శాతం రైల్వేలే భరించాయని బీజేపీ ప్రతినిధి సంబిట్‌ పాత్రా స్పష్టం చేశారు. మన గ్రామాలు ఇటలీగా మారాలని తాము కోరుకోవడం లేదని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఘనమైన ప్రకటనలు నిస్తేజంలో ఉన్న విపక్ష శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు ఉపకరించినా ప్రజలకు సాయం అందడం ముఖ్యమని, ప్రభుత్వం పూర్తి బాధ్యతతో అవసరార్ధులకు సాయం అందేలా చర్యలు చేపడుతోందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.

వలస కూలీలకు ఉచిత రైలు ప్రయాణం కల్పించడం లేదని, గుజరాత్‌లో ట్రంప్‌ కార్యక్రమానికి మాత్రం రూ 100 కోట్లు వెచ్చించారని సోనియా గాంధీ విమర్శించిన నేపథ్యంలో పాలక పార్టీ ఈ మేరకు స్పందించింది. ఇక కాంగ్రెస్‌ అధినేత్రి మాటలకు క్షేత్రస్ధాయిలో పరిస్థితికి పోలిక లేదని, వలస కూలీల తరలింపుకైన వ్యయంలో రైల్వేలు 85 శాతం ఖర్చును చెల్లించాయని, కాంగ్రెస్‌ పార్టీ ఆ డబ్బు చెల్లించేందుకు బదులు రాజకీయాలకు పాల్పడకుండా తమ పార్టీ పాలిత రాష్ట్రాలు మిగిలిన 15 శాతం తమ వాటాను చెల్లించేలా వ్యవహరిస్తే మేలని బీజేపీ హితవు పలికింది. చదవండి : వలస కార్మికులపై చార్జీల భారమా!?

మరిన్ని వార్తలు