కమలం సై!

26 Sep, 2018 09:00 IST|Sakshi

ముందస్తుపై కసరత్తు షురూ

బీజేపీ సీనియర్లందరూ బరిలోకి

అన్ని నియోజకవర్గాల్లో పోటీ

4,5 తేదీల్లో ఎంపికపై ప్రాథమిక కసరత్తు

సాక్షి, సిటీబ్యూరో: ముందస్తు ఎన్నికల వేగాన్ని పెంచే దిశగా భారతీయ జనతా పార్టీ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న ఐదు శానసభ స్థానాల్లో తిరిగి వారినే పోటీకి నిలుపాలని నిర్ణయించారు. అందులో భాగంగా డాక్టర్‌ లక్ష్మణ్‌ ముషీరాబాద్‌ నుంచి, అంబర్‌పేట నుంచి కిషన్‌రెడ్డి, ఉప్పల్‌ నుంచి ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, ఖైరతాబాద్‌ నుంచి చింతల రాంచంద్రారెడ్డి, గోషామహల్‌ నుంచి రాజాసింగ్‌లో లోథా సనత్‌నగర్‌ నుంచి ఎంపీ బండారు దత్తాత్రేయ, మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్సీ రాంచందర్‌రావులు పోటీ చేసేందుకు పార్టీ దాదాపు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, సనత్‌నగర్, మల్కాజిగిరి స్థానాలపై ఒకింత ఊగిసిలాట ఉంది. దత్తాత్రేయ పోటీకి విముఖత చూపితే ఆయన స్థానంలో ఆయన సమీప బంధువు ప్రదీప్‌ లేదా మహిళా విభాగం నాయకురాలు ఆకుల విజయలలో ఒకరి చేత పోటీ చేయించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. అనారోగ్య కారణాల దృష్ట్యా మల్కాజిగిరి స్థానంలో పోటీకి రాంచందర్‌రావు ఏ మేరకు సిద్ధమవుతారోనన్న అంశం ఒకింత అయోమయంలో ఉంది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాలకు పోటీ చేయాలని నిర్ణయించి, అభ్యర్థుల ఎంపిక కోసం వచ్చే నెల 4, 5 తేదీల్లో డివిజన్, నియోజకవర్గ ముఖ్య నాయకుల అభిప్రాయాలను సేకరించనున్నారు. అభిప్రాయాల సేకరణ అనంతరం టికెటు ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తామన్న హామీని కూడా తీసుకోనున్నారు. నియోజకవర్గ ముఖ్య నాయకులతో లోక్‌సభ ఇన్‌చార్జులు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధమైంది.

అమిత్‌షాతో భారీ సభ  
పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయడటంలో భాగంగా ఇప్పటికే వార్డు, డివిజన్‌ సభలు నిర్వహిస్తున్న పార్టీ నేతలు త్వరలో భారీ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 7న చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని శంషాబాద్‌లో భారీ యువజన సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఇదే తరహంలో అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ నిర్వహించి ప్రచార పర్వమంతా యువత ఆధ్వర్యంలోనే ముందుకు తీసుకుపోనున్నారు. పనిలో పనిగా తాము బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నాయకులను కూడా బీజేపీలోకి తీసుకురానున్నారు. ఇప్పటికే మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ పరిధిలో పలువురు నాయకులు బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఇదిలా ఉంటే ప్రచార పర్వం భారీగా పుంజుకున్న తర్వాత అక్టోబర్‌ మూడవ వారంలో నగరంలో అమిత్‌షాతో సభను నిర్వహించాలని కూడా నిర్ణయించారు.

మరిన్ని వార్తలు