నిర్ణయాత్మక మోదీనా? గందరగోళ విపక్షాలా?

8 Apr, 2019 05:05 IST|Sakshi

ఎన్నికలకు పార్టీ ప్రచార ఇతివృత్తాలను ప్రకటించిన బీజేపీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు దీటుగా భారతీయ జనతా పార్టీ సైతం ఆదివారం తన ప్రచార ఇతివృత్తాలను ప్రకటించింది. నిర్ణయాత్మక మోదీ, చిందరవందరగా ఉన్న విపక్షాల మధ్యే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ అని పేర్కొంది. కేంద్ర మంత్రి పీయూశ్‌ గోయల్, బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్‌ యాదవ్‌తో కలసి ఆర్థిక మంత్రి జైట్లీ పార్టీ నినాదాలు, ప్రచార వీడియోలను విడుదల చేశారు. ఒక కెప్టెన్‌ లేదా 11 మంది ఆటగాళ్లు, 40 మంది కెప్టెన్ల ప్రభుత్వాల్లో ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని జైట్లీ అన్నారు.

తమ ప్రచార ట్యాగ్‌లైన్‌ అయిన ‘ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌’ మోదీ ఐదేళ్ల పాలనాకాలంలో సాధించిన విజయాలు, తీసుకున్న కీలక నిర్ణయాల చుట్టే తిరుగుతుందని చెప్పారు. పేదలు, మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా ప్రచారం చేస్తామని తెలిపారు. మధ్యతరగతిపై పన్ను భారం పెంచేలా కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఉందని ఆ పార్టీ సలహాదారులే అభిప్రాయపడ్డారని, కానీ గత ఐదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా పన్నులు తగ్గించిందని అన్నారు. ఈసారి కూడా మెజారిటీ ప్రభుత్వం రావాలని, 2014లో వచ్చిన మెజారిటీతో ఎన్డీయే ప్రభుత్వం అవినీతి, నల్లధన నియంత్రణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుందని గుర్తుచేశారు. పన్ను పరిధిని పెంచుతూనే మోదీ ప్రభుత్వ ద్రవ్యోల్బణాన్ని తగ్గించిందని, సంక్షేమానికి వ్యయం పెంచి సామాన్యుల పన్ను భారాన్ని తగ్గించిందని తెలిపారు.

మరిన్ని వార్తలు