బీజేపీ హఠావో దేశ్‌ బచావో : మమతా బెనర్జీ

21 Jul, 2018 16:36 IST|Sakshi
మమతా బెనర్జీ (ఫైల్‌ ఫోటో)

కోల్‌కత్తా : బీజేపీ ప్రభుత్వం తాలిబన్‌ గ్రూపులను తయారుచేసి దేశంలో విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా  బెనర్జీ ఆరోపించారు. పార్టీ వార్షిక దినోత్సవం సందర్భంగా శనివారం కోల్‌కత్తాలో మెగా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్బంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. మతకల్లోలాలు  సృష్టించి వారి చేతులు రక్తపు మరకలతో తడిసిపోయాయని మమతా ధ్వజమెత్తారు. బీజేపీ నేతల అహంకార, బెదిరింపులు మాటలకు ప్రజలు భయపడవద్దని సూచించారు. ప్రజల క్షేమం కోసం సరిగ్గా టెంట్‌ కూడా నిర్మించలేని వారు దేశాన్ని ఏం నిర్మిస్తారని ప్రశ్నించారు. ఇటీవల మిద్నాపూర్‌లో మోదీ సభలో టెంట్‌ కూలి 90 మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.

దేశాన్ని మతతత్వ బీజేపీ నుంచి రక్షించేందుకు ‘బీజేపీ హఠావో దేశ్‌ బచావో’ అనే నినాదాన్ని ఆగస్ట్‌ 15 నుంచి ప్రచారం చేస్తామని మమత ప్రకటించారు. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో తృణమూల్‌ విజయం సాధించి తీరుతుందని మమత ఆశాభావం వ్యక్తం చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 32 స్థానాల్లో టీఎంసీ విజయం సాధించిన విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు జనవరిలో అన్నిపార్టీల నేతలతో కోల్‌కత్తాలో భార్యీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు మమతా ప్రకటించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల్లో కొందరూ మంచివారు ఉన్నారని, వారిని గౌరవిస్తానని పేర్కొన్నారు. కొందరూ మాత్రం మతకల్లోలు సృష్టించి దేశంలో అల్లర్లు రేపాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సీనియర్‌ నేత చందన్‌ మిత్రా బీజేపీకి రాజీనామా చేసి తృణమూల్‌లో చేరుతున్నట్లు మమతా ప్రకటించారు. వీరితో పాటు నలుగురు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కూడా టీఎంసీలో చేరారు.

మరిన్ని వార్తలు