మిజో సంస్కృతి ధ్వంసం

21 Nov, 2018 02:30 IST|Sakshi
చంపాయ్‌లో బాబును ఎత్తుకున్న రాహుల్‌

బీజేపీ, ఆరెస్సెస్‌లపై రాహుల్‌

ఐజ్వాల్‌: బీజేపీ, ఆరెస్సెస్‌లు మిజోరం సంస్కృతి, వారసత్వం, భాషను ధ్వంసం చేస్తున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదని అవి గ్రహించాయని పేర్కొన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మిజోరం రాజధాని ఐజ్వాల్, చాంపాయ్‌లలో మంగళవారం నిర్వహించిన ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు తిరిగి అధికారం అప్పగిస్తే మిజోరంను తూర్పు భారత్‌కు ముఖద్వారం చేస్తామని, వచ్చే ఏడాది రాష్ట్రంలో 11 వేల కొత్త ఉద్యోగాల్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. పదేళ్ల లాల్‌ తాన్హావ్లా ప్రభుత్వంలో మిజోరం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు అయ్యిందని ఆయన అన్నారు.  

పాపులారిటీ కోసం కోట్లు కొల్లగొట్టారు..
‘మిజోరంలోకి ప్రవేశించి రాష్ట్ర సంస్కృతిని నాశనం చేయడానికి ఇదే తగిన సమయమని బీజేపీ, ఆరెస్సెస్‌లు భావిస్తున్నాయి. ఎందుకంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలవకపోవచ్చని వారికి అర్థమైంది. బీజేపీ ప్రయత్నాలకు ప్రధాన ప్రతిపక్షం ఎంఎన్‌ఎఫ్‌ లాంటి పార్టీ సహకారం అందించడం విచారకరం’ అని రాహుల్‌ అన్నారు. రఫేల్‌ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ..మోదీ తన పాపులారిటీ పెంచుకోవడానికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు