విజయంపై కమల ‘విశ్వాసం’

20 Jul, 2018 03:26 IST|Sakshi

అవిశ్వాసాన్ని ఓడిస్తామన్న బీజేపీ

ప్రభుత్వం తప్పులు ఎత్తిచూపుతామన్న కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: శుక్రవారం లోక్‌సభలో జరగనున్న విశ్వాస పరీక్షలో గెలిచితీరుతామని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్నందున తమదే విజయమంటోంది. చివరి వరకు పలు విపక్ష పార్టీల విశ్వా సాన్ని కూడా పొందుతామని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు వెల్లడించారు. ‘అంకెలు స్పష్టంగా ఉన్నాయి. దిగువ సభలో బీజేపీకి సరిపోయేంత మెజారిటీ ఉంది. ఎన్డీయే పక్షాల బలమే 314.

పలు కాంగ్రెసేతర పక్షాలు కూడా విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. అంకెలతోపాటు.. దేశాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్న విపక్షాల వ్యతిరేక రాజకీయాలను గెలిచే నైతిక స్థైర్యం కూడా మాకుంది.  దీంతో మేం సభ విశ్వాసాన్ని పొందడం ఖా యం’ అని ఆయన పేర్కొన్నారు. అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన టీడీపీపై బీజేపీ సీనియర్‌ నేత సుబ్రమణ్యస్వామి తీవ్రంగా మండిపడ్డారు. ‘బీజేపీ పాలన బాలేదంటూ టీడీపీ అవిశ్వాసం పెట్టింది. నాలుగేళ్లపాటు కేంద్ర కేబినెట్‌లో భాగస్వామిగా ఉన్న పార్టీ ఇప్పుడు ఆ ప్రభుత్వంపైనే అవిశ్వాసం పెట్టడం ఎంతవరకు సమంజసం’ అని విమర్శించారు.

సోనియా లెక్కల్లో వీక్‌
అవిశ్వాసాన్ని నెగ్గించుకునేందుకు తమ వద్ద సరిపోయేంత బలముందంటూ కాంగ్రెస్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ వ్యాఖ్యలు చేసిన యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ‘లెక్కల్లో వీక్‌’ అని కేంద్ర  మంత్రి అనంత కుమార్‌ ఎద్దేవా చేశారు. ఏ లెక్క ప్రకారం చూసినా విపక్షాల వద్ద ఉన్న సంఖ్యాబలం తమతో సరిపోదన్నారు.

విపక్షాల అండ ఉంది: కాంగ్రెస్‌
అవిశ్వాస తీర్మానం అంకెల గారడీ కాదని.. ఈ వేదిక ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు ఎత్తిచూపుతామని కాంగ్రెస్‌ పేర్కొంది. ‘మాకు పెద్ద సంఖ్యలో విపక్షాలు అండగా ఉన్నాయి. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలను పేర్కొంటూ.. ప్రజల వరకు వాస్తవాలు వెళ్లేలా చేస్తాం. 2019 లోక్‌సభ ఎన్నికల సమరానికి ఇది ప్రారంభం’ అని పార్టీ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ ఢిల్లీలో పేర్కొన్నారు.  

అవిశ్వాసానికి వ్యతిరేకంగా..
లోక్‌సభలో ఎన్డీయేకు 314 ఎంపీల మద్దతుంది. దీనికి తోడు ఇతర చిన్న చిన్న పార్టీల మద్దతును కూడా బీజేపీ కూడగడుతోంది. ఎన్డీయేతర పక్షాలైన పీఎంకేతోపాటు స్వాభిమానీ ప„Š లు కూడా ఇప్పటికే ఎన్డీయేకు మద్దతు ప్రకటించాయి. కొంతకాలంగా బీజేపీ అధిష్టానానికి వ్యతిరేక గళం వినిపిస్తున్న పట్నా సాహిబ్‌ ఎంపీ శతృఘ్న సిన్హా.. విశ్వాస పరీక్షలో బీజేపీకి అనుకూలంగా ఓటేస్తానన్నారు. అటు అన్నాడీఎంకే కూడా అవిశ్వాసానికి మద్దతివ్వకపోవచ్చనే సంకేతాలిచ్చింది. ‘మేం కావేరీ వివాదంపై సభలో ఆందోళన చేస్తున్నప్పుడు ఒక్క విపక్ష పార్టీ కూడా మాకు మద్దతు తెలపలేదు. అలాంటప్పుడు ఏపీ వ్యక్తిగత సమస్యకు మేమేందుకు మద్దతివ్వాలి’ అని తమిళనాడు సీఎం పళనిస్వామి పేర్కొన్నారు. లోక్‌సభలో బీజేపీ, కాంగ్రెస్‌ తర్వాత అన్నాడీఎంకే (37 ఎంపీలు) అతిపెద్ద పార్టీ. 20 మంది ఎంపీలున్న బీజేడీ.. అవిశ్వాసం విషయంలో లోక్‌సభలోనే తమ నిర్ణయాన్ని తెలుపుతామంది.  

ఇంకా నిర్ణయించుకోలేదు: శివసేన  
అవిశ్వాస తీర్మానంలో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని శివసేన ప్రకటించింది. అయితే ఎంపీలంతా ఢిల్లీలోనే ఉండాలని.. అధినేత ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వారికి సూచించింది. ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై శుక్రవారం ఉదయం అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే నిర్ణయం తెలియజేస్తారని పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు