బెడిసికొట్టిన బాబు వ్యూహం

16 May, 2018 02:04 IST|Sakshi

కర్ణాటకలో పనిచేయని టీడీపీ ప్రచారం

తెలుగు ప్రభావిత జిల్లాల్లో గతంకన్నా మెరుగైన ఫలితాలు సాధించిన బీజేపీ

ప్రత్యేక హోదా అంశంలో చంద్రబాబే ప్రధాన దోషి అంటున్న తెలుగు ప్రజలు

ప్యాకేజీ కోసం హోదాను నాలుగేళ్లు నిర్లక్ష్యం చేశారని విమర్శలు

ఆయన మాటలకు విశ్వసనీయత లేదని వ్యాఖ్యలు

బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇవ్వకుండా ద్రోహం చేసిన బీజేపీని కర్ణాటకలో తెలుగు ప్రజలు ఓడించి బుద్ధి చెప్పాలి.’’ –మే 1న ధర్మపోరాట సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు ఇది.

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని కర్ణాటకలో స్థిరపడిన తెలుగు ఓటర్లకు చంద్రబాబు పిలుపు ఇవ్వడంతో, తెలుగు ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉన్న నియోజకవర్గాల ఫలితాలపై అంతటా ఆసక్తి నెలకొంది. ఇక ఫలితాలు రాగానే తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ పార్టీ అనుకూల ఎల్లో మీడియా తమకు అనుకూలమైన ప్రచారం ప్రారంభించాయి.

తెలుగు ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో ఓడిపోయిందని, అదంతా తమ ప్రభావమేనని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు .వాస్తవంగా చూస్తే తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాలలో బీజేపీ సాంప్రదాయకంగా బలహీనంగానే ఉంది. కొన్నిచోట్ల ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. ఆ ప్రాంతాల్లో గతం కంటే ఇపుడు ఎక్కువ సీట్లు సాధించిందని ఫలితాలను బట్టి అర్ధమవుతోంది. గతంలో ఉన్న స్థానాలను నిలబెట్టుకోవడంతోపాటు కొత్తగా కొన్ని ప్రాంతాలకు విస్తరించింది.

చంద్రబాబు మాటలను నమ్మి ఉంటే బీజేపీ అసలు ఒక్క సీటు కూడా గెలవ కూడదు కదా.. తెలుగు ఓటర్లు చంద్రబాబు మాటలు నమ్మలేదనేందుకు ఈ ఫలితాలే నిదర్శమని విశ్లేషకులంటున్నారు. ‘‘చంద్రబాబు మాటలకు విశ్వసనీయత లేదని, ప్రత్యేక హోదా విషయంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని తెలుగు ఓటర్లు భావిస్తున్నారు. అందుకు ఈ ఫలితాలే రుజువు’’ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరగడంలో ఆయనే ప్రధాన దోషి అని అక్కడి తెలుగు ప్రజలు భావిస్తున్నారు.

పసలేని ప్రచారం..
తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీని పెద్దగా ఆదరణ లభించలేదన్న టీడీపీ అనుకూల మీడియా ప్రచారంలో వాస్తవం లేదని ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తున్నవారు స్పష్టం చేస్తున్నారు. తెలుగువారు అధికంగా నివసించే కోలారు, చిక్‌బళ్లాపూర్, తుముకూరు తదితర ప్రాంతాల్లో బీజేపీ సంప్రదాయంగా బలహీనంగా ఉంది. ఈ ప్రాంతాల్లో గతంలో బీజేపీ ప్రభావం కనిపించేది కాదు. కాంగ్రెస్‌ ఎక్కువ చోట్ల, జేడీఎస్‌ కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నాయి. బీజేపీ నాయకత్వం కూడా బలంగా ఉన్న ప్రాంతాల మీద ఎక్కువగా దష్టి కేంద్రీకరించారు. బలహీనంగా ఉన్న ప్రాంతాల మీద దృష్టి పెట్టలేదు.

అందువల్లే రాష్ట్రంలో మొత్తం ఓట్ల శాతంలో కాంగ్రెస్‌ కంటే బీజేపీకి తక్కువ వచ్చినా.. సీట్లు అధికంగా వచ్చాయి. గతంలో గెలవని గంగావతి, కనకగిరి, ఎలబురగ, దేవదుర్గ, సేడం, యాదగిరి తదితర తెలుగు ప్రభావం ఉన్న సీట్లలో ఈ ఎన్నికల్లో బీజేపీ విజయ బావుటా ఎగరేసింది. తెలుగు ప్రజల ప్రభావం ఉన్న బెంగళూరు సిటీలో గతంలో మాదిరి 12 సీట్లను నిలబెట్టుకుంది.

గతంలో తెలుగు ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీకి 8 సీట్లు ఉండగా.. ఈ ఎన్నికల్లో ఆ సంఖ్య రెట్టింపై 16కు పెరిగింది. కొప్పల, బళ్లారి, రాయచూరు తదితర తెలుగు ప్రభావిత జిల్లాల్లో కొత్తగా 8 సీట్లు గెలవడం గమనార్హం. తెలుగువారు బీజేపీని తిరస్కరించారని, చంద్రబాబు నాయుడు ప్రచారం చేయడం వల్ల బీజేపీకి నష్టం జరిగిందంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగువారి ప్రభావం అధికంగా ఉన్న హైదరాబాద్‌ కర్ణాటక ప్రాంతంలో గతంలో 6 సీట్లు ఉండగా, ప్రస్తుతం 20 సీట్లు గెలవడం గమనార్హం.

ఏపీ సరిహద్దు జిల్లాల్లో బీజేపీకి పెరిగిన సీట్లు
ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో.. రాయచూరు, బళ్లారి, కోలార్, కొప్పల్, చిక్‌బళ్లాపూర్‌.. 5 జిల్లాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ 5 జిల్లాల్లో బీజేపీ 5 సీట్లు గెలిచింది. ఈ ఎన్నికల్లో 8 సీట్లు కైవసం చేసుకుంది. కోలార్‌ జిల్లా మినహా మిగతా జిల్లాల్లో గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలవడం గమనార్హం. రాయచూరులో రెండు సీట్లను నిలబెట్టుకుంది. బళ్లారిలో ఒక సీటు నుంచి మూడుకు పెరిగింది. కొప్పల్‌లో కూడా ఒక్క సీటు నుంచి 3 సీట్లకు బీజేపీ బలం పెరిగింది. చిక్‌బళ్లాపూర్‌లో గత ఎన్నికల్లో బోణీ చేయలేకపోయింది.

ఈసారీ అదే పునరావృతమైంది. సరిహద్దు జిల్లాల్లో చంద్రబాబు ప్రభావం పెద్దగా కనిపించలేదు. బీజేపీని తిరస్కరించాలన్న చంద్రబాబు విజ్ఞప్తిని ప్రజలు తోసిపుచ్చారు.  ఎల్హంకలో ఎస్‌ఆర్‌ విశ్వనాథ్, మల్లేశ్వరంలో అశ్వర్థనారాయణ, రాయచూర్‌లో శివరాజ్‌ పాటిల్, చిత్రదుర్గలో తిప్పారెడ్డి, యాద్‌గిర్‌లో వెంకటరెడ్డి, గంగావతిలో ఈశ్వరప్ప, సిరిగుప్పలో సోమలింగప్ప,  మెలకాల్మూరులో బోయ శ్రీరాములు, తుముకూరు సిటీలో జ్యోతిగణేశ్‌తో పాటు మెజార్టీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.

దేవనహళ్లి(నిసర్గ నారాయణస్వామి), తుముకూరు రూరల్‌(గౌరీ శంకర్‌) లాంటి ప్రాంతాల్లో జేడీఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. అంటే బీజేపీ ఓడిన ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్‌కు లాభించలేదు. దీన్నిబట్టి చూస్తే చంద్రబాబు మాటలను కర్నాటకలోని తెలుగు ప్రజలెవ్వరూ విశ్వసించలేదని, ప్రత్యేక హోదా రాకపోవడానికి ఆయనే కారణమని అర్ధం చేసుకున్నారనేది స్పష్టమవుతోంది.

చంద్రబాబునే ప్రధాన దోషిగా భావిస్తున్న తెలుగు ప్రజలు
ఏపీకి ప్రత్యేకహోదా రాకపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబే అని కర్ణాటకలోని తెలుగు ప్రజలు భావిస్తున్నారు. ఎన్నికల్లో 5 కాదు 15 ఏళ్లు ప్రత్యేకహోదా కావాలని అప్పటి ప్రధాని అభ్యర్థి మోదీని అడిగిన చంద్రబాబు నాలుగేళ్లపాటు ‘హోదా’ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని దేవనహళ్లిలోని భుజంగరావు ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజి చాలని, హోదా ఏమైనా సంజీవనినా? అని హోదాను నిర్లక్ష్యం చేసిందే చంద్రబాబు అని ఆయన విమర్శించారు.

అలాగే నియోజకవర్గాల పెంపు, ప్రత్యేక ప్యాకేజీ మినహా ‘హోదా’ సాధనపై చంద్రబాబుకు ఎప్పుడూ చిత్తశుద్ధి లేదని, కేంద్రం వద్ద ఆయన హోదా ప్రస్తావనే తీసుకురాలేదని బెంగళూరు సిటీ పరిధిలోని మల్లేశ్వరంలో నివసించే నాగముని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే సమయంలో ప్యాకేజీ వద్దు, హోదానే కావాలని ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేదని శాంతినగర్‌లోని సుబ్బారెడ్డి ప్రశ్నించారు.

ఏపీలోని రాజకీయ పరిస్థితులు, ప్రత్యేకహోదా రాకపోవడానికి కారణాలు, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక లోని తెలుగు ప్రభావిత జిల్లాలైన బళ్లారి, బెంగళూరుసిటీ, కోలార్, యాద్‌గిర్, చిక్‌బళ్లాపూర్, రాయచూర్, బీదర్‌తో పాటు మొత్తం బెంగళూరు సిటీ, హైదరాబాద్‌ కర్నాటక, సెంట్రల్‌ కర్నాటక పరిధిలోని 12 జిల్లాల్లోని తెలుగు ఓటర్లలో తీవ్ర చర్చే నడిచింది. మెజార్టీ ప్రజలు హోదా అంశంలో చంద్రబాబే తప్పు చేశారని, ఆయనే దోషి అని కేవలం రాజకీయ స్వార్థం కోసమే ఈ తరహా ప్రచారానికి దిగారనే నిర్ణయానికి వచ్చారు. అందుకు అనుగుణంగానే వారు ఓట్లు వేసినట్లు ఫలితాలను బట్టి అర్ధమవుతోంది.

మరిన్ని వార్తలు