తాగుబోతుల రాష్ట్రంగా మార్చారు

16 Dec, 2019 10:27 IST|Sakshi
మాట్లాడుతున్న పొంగులేటి సుధాకర్‌రెడ్డి

తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే

పార్టీ తెలంగాణ కోర్‌ కమిటీ సభ్యుడు సుధాకర్‌రెడ్డి

సాక్షి, పాల్వంచ: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తూ తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ తెలంగాణ కోర్‌ కమిటీ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కబడితే అక్కడ మద్యం దుకాణాలకు లైసెసన్సులు ఇచ్చారని, దీంతో బెల్టు దుకాణాలు గల్లీకొకటి ఏర్పడిందని, విచ్చలవిడిగా మద్యం విక్రయించడంతో అది తాగిన యువకులు మహిళలపై లైంగికదాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

నిదర్శనమే దిశ, టేకులపల్లి లక్ష్మి ఉదంతాలని చెప్పారు. దేశంలో ఎన్‌ఆర్‌సీ, సీఏబీ బిల్లును దేశ భవిష్యత్, భద్రత దృష్ట్యా ప్రజలు స్వాగతిస్తున్నారని, కానీ, విపక్షాలు మైనార్టీలను రెచ్చగొట్టి ఈశాన్యా రాష్ట్రాల్లో అల్లర్లు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. కాగా, స్థానిక బీజేపీ కార్యాలయంలో భారతదేశ తొలి హోంశాఖ మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ 69వ వర్ధంతి సందర్భంగా సుధాకర్‌రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు.

భారతదేశ ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ అని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎన్నికల అధికారి సత్యప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఏనుగుల శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు భూక్యా ప్రసాద్, ఇల్లెందు నియోజకవర్గ కన్వీనర్‌ కుటుంబరావు, మీడియా కన్వీనర్‌ జైన్, మాధవ్, శ్రీనివాస్, రమేశ్‌ పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు