అందుకే తబ్లిగీ జమాత్‌ కేసుల గురించి దాస్తున్నారా?

8 Apr, 2020 11:39 IST|Sakshi

మమత సర్కారుపై బీజేపీ ధ్వజం

కోల్‌కతా: మహమ్మారి కరోనా విజృంభణతో ప్రజలు బెంబేలెత్తిపోతున్న వేళ నిజాముద్దీన్‌ ఘటనపై రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలకు దిగుతున్నాయి. బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు, ప్రతిపక్ష బీజేపీ నాయకులు సోషల్‌ మీడియాలో వాగ్యుద్ధానికి తెరలేపారు. ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తబ్లిగీ జమాత్‌కు వెళ్లిన వారి వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారని బీజేపీ మండిపడగా.. నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో తబ్లిగీ జమాత్‌కు హాజరైన వారిలో అత్యధిక మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ​కార్యక్రమానికి హాజరైన వారందరి సమాచారం అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారిని గుర్తించి వెంటనే క్వారంటైన్‌కు తరలించాలని పేర్కొంది.(కరోనా కలకలం: అసోం ఎమ్మెల్యే అరెస్టు)

ఈ నేపథ్యంలో తబ్లిగీ జమాత్‌ కేసులపై మీడియా అడిగిన ప్రశ్నలకు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సమధానం దాటవేశారు. అటువంటి ప్రశ్నలు(కమ్యూనల్‌ క్వశ్చన్లు) అడగకూడదని సూచించారు. ఈ విషయంపై స్పందించిన బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్‌ మాలవీయ సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ‘‘జమాత్‌ కేసులు దేశంలో ప్రకంపనలు సృష్టించాయి. కానీ బెంగాల్‌లో ఎన్ని కొత్త కరోనా కేసులు నమోదయ్యాయోనన్న విషయంపై స్పష్టత లేదు. ఎంత మందిని గుర్తించారు. ఎంత మందికి పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాలేమిటి? ఇంతవరకు అప్‌డేట్‌ లేదు. ఓటు బ్యాంకు కోసమే ఆమె ఇదంతా చేస్తున్నారా’’ అని మమతా బెనర్జీ తీరును ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు