నిబంధనలను అతిక్రమించిన కేసీఆర్‌

8 Dec, 2018 05:02 IST|Sakshi

బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఎన్నికల్లో ఒంటరి పోటీ ద్వారా తమ పార్టీ సామర్థ్యం బయట పడిందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణలో 119 స్థానాలకుగాను 118 స్థానాల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారని, ప్రజాస్వామ్యంలో తాము ఈ ప్రయత్నం చేయడమే గెలుపుగా భావిస్తున్నామన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత 20 రోజుల్లో కేంద్రంలో తాము ఏం చేస్తున్నామన్నది ప్రజలకు స్పష్టంగా చెప్పగలిగామన్నారు. ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా శిరసావహిస్తామని, ఎన్ని సీట్లిచ్చిన బాధ్యతగా పనిచేస్తామని పేర్కొన్నారు. 

చింతమడకలో సీఎం కేసీఆర్‌ ఓటువేసిన తర్వాత టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని చెప్పి కోడ్‌ ఉల్లంఘించారన్నారు. ఎన్నికల బూత్‌ దగ్గర నిలబడి తమ ప్రభుత్వానికి వ్యతిరేకత లేదని, పవనాలు తమవైపే వీస్తున్నాయని చెప్పడం నిబంధనలను అతిక్రమించడమేనని పేర్కొన్నారు. ఆపద్ధర్మ సీఎం ఇలా చేయడం ఘోరమని, ఆయన వైఖరిని ఖండిస్తున్నామన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, ఆయన అభ్యర్థిత్వాన్ని కొట్టివేయాలని, అనర్హుడిగా ప్రకటించాలని కోరినట్లు వెల్లడించారు. కల్వకుర్తిలో జరిగిన దాడిలో తమ పార్టీకి సంబంధం లేదని, అది కాంగ్రెస్‌ పార్టీ చేసిన సింపతి డ్రామా అని పేర్కొన్నారు. దాడిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు