లక్ష్మణ్‌ను కలిసిన సుహాసిని రెడ్డి

5 Feb, 2020 08:11 IST|Sakshi
హైదరాబాద్‌లో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో మాట్లాడుతున్న సుహాసిని రెడ్డి, జిల్లా నేతలు

సాక్షి, ఆదిలాబాద్‌: ఇక లక్ష్మణ బాణమే మిగిలింది. జిల్లా బీజేపీలో అంతర్గత కలహాల నేపథ్యంలో సుహాసిని రెడ్డి వర్గం జిల్లా అధ్యక్షుడి వ్యవహారాన్ని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ దృష్టికి తీసుకెళ్లింది. ఇక్కడి నేతలు చెప్పిన విషయాలను విన్న ఆయన అటువైపు నుంచి కూడా వివరణ తీసుకొని నిర్ణయం వెళ్లడిస్తామని చెప్పడంతో ఇక మీపైనే భారమంటూ జిల్లా నేతలు తిరుగుబాట పట్టారు. ఇదిలా ఉంటే ఒకవైపు ఓవర్గం నేతలు తనపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర రాజధానికి వెళ్లగా, మరోవైపు పాయల శంకర్‌ దేశ రాజధాని ఢిల్లీలో ఎంపీ సోయం బాపురావు, ఇతర నేతలతో కలిసి బీజేపీ ముఖ్యనేతలను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఏదైన మంత్రాంగం నడిపారా? అనే ఆసక్తి నెలకొంది. అయితే పార్టీ విషయాలు బయటకు తెలియరాలేదు. జిల్లా నుంచి సుమారు 140 మంది బీజేపీ నేతలు, కార్యకర్తలు కలిసి 25 వాహనాల్లో మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు తరలివెళ్లారు.

బీజేపీలో రచ్చ: ఒక్కరి చేతిలో పార్టీ నిర్ణయాలు

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా బయల్దేరివెళ్లారు. కాగా సాయంత్రం వీరిలో 73 మంది జిల్లా, మండల పదాధికారులు, గాదిగూడ జెడ్పీటీసీ, బజార్‌హత్నూర్‌ ఎంపీపీ, పది మంది ఎంపీటీసీలు, ఓ సర్పంచ్, ఉపసర్పంచ్, ఇతర కార్యకర్తలు ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. నాంపలి్లలోని బీజేపీ కార్యాలయంలో సాయంత్రం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, మోత్కుపల్లి నర్సిములు, మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌లను జిల్లా నేతలు కలిశారు. ఆదిలాబాద్‌ జిల్లా పార్టీలో ఒక్కడి చేతిలో నిర్ణయాలు జరుగుతున్నాయని, కోర్‌ కమిటీ కూర్చోకుండానే బీ–ఫామ్‌ల కేటాయింపు జరుగుతోందని లక్ష్మణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఏక వ్యక్తి నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ ఆఫీసును నామమాత్రం చేశారని వివరించారు. ఎన్నికల సమయంలో సమష్టి నిర్ణయాలు జరగడం లేదని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికలతోపాటు అంతకుముందు జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ ఏక వ్యక్తి నిర్ణయాల కారణంగా పార్టీ అనేక చోట్ల ఓటమి పాలైందదని, లేదంటే బీజేపీకి మంచి ఫలితాలు వచ్చేవని వివరించారు.

ఇకనైనా పార్టీని కాపాడాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ మంగళవారం ఢిల్లీలో నిజామాబాద్‌ ఎంపీ అరవింద్, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు ఆధ్వర్యంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిశారు. ఒకవైపు తనపై రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు చేసేందుకు జిల్లానేతలు వెళ్లగా మరోవైపు ఆయన ఢిల్లీలో ఏదైన మంత్రాంగం నడిపారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నా అవి బయటకు రాలేదు. బీజేపీలో జరుగుతున్న ఈ రచ్చ ఆసక్తి కలిగిస్తోంది. ఆదిలాబాద్‌కు వివిధ రైళ్ల పొడిగింపు విషయంలో కేంద్ర మంత్రిని కలిసినా ఢిల్లీలో ఇతర నేతలను కూడా ఆయన కలిశారా.. లేనిపక్షంలో తనపై తిరుగుబాటు చేస్తున్న నేతలకు చెక్‌ పెట్టేందుకు ఏదైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది.  

మరిన్ని వార్తలు