‘కేసీఆర్‌ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు’

3 Sep, 2019 17:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘తినడానికి తిండి లేదు.. మీసాలకు సంపెగ నూనె’ అన్న చందంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె. లక్ష్మణ్‌ ఆరోపించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ.. చేతలు గడప దాటడం లేదని విమర్శించారు. కేసీఆర్‌ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని  ఎద్దేవా చేశారు. తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికులు 42 రోజులు విధులు బహిష్కరించి పోరాడారని, అయితే ప్రస్తుతం ఆర్టీసీని కేసీఆర్‌ నష్టాల్లో నెట్టేశారని ఆరోపించారు. సీఎం నిర్వాకం వల్లే ఆర్టీసీ నష్టాల్లో, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని లక్ష్మణ్‌ స్పష్ట చేశారు.

ఆర్టీసీలో రోజుకు కోటి రూపాయల వడ్డీ చెల్లిస్తున్నారని, ఆర్టీసీకి  ప్రభుత్వం  వెయ్యి కోట్ల రూపాయలు బాకీ పడి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం 27 శాతం వ్యాట్ పేరుతో ఆర్టీసీ నుంచి వసూలు చేస్తోందని, ఆర్టీసీ కార్మికుల నడ్డి విరిచి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులు వాడుకుని బిల్లులు చెల్లించలేదని, ఏడాది కాలంగా ఆర్టీసీకి  ఎండీ, చైర్మన్‌ను నియమించలేదు ని విమర్శించారు.  ఆర్టీసీ అప్పులు ప్రభుత్వం ఎందుకు చెల్లించలేకపోతుందని, ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అవసరం అయితే ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలని లక్ష్మణ్‌ సూచించారు.

మరిన్ని వార్తలు