నిర్మలా సీతారామన్‌ను కలిసిన లక్ష్మణ్‌

27 Nov, 2019 17:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపి నడ్డాను కలిసి తెలంగాణ సమస్యలను వివరించినట్లు బీజేపీ రాష్ట అధ్యక్షుడు కె లక్ష్మణ్‌ తెలిపారు. అనంతరం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్‌హెచ్‌ 44ను పారిశ్రామిక కారిడార్‌గా ప్రకటించాలని ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అదే విధంగా రాష్ట్రానికి ఐఐఎం, నవోదయ,  కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వాలని కోరినట్లు లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో ప్రభుత్వ బడులను మూసేవేస్తూ బార్లను తెరిచేందుకు కొత్త విధానం తీసుకువస్తున్నారని ఆయన మండిపడ్డారు. 12 వేల ప్రభుత్వ బడులను మూసివేస్తున్నారని ఆరోపించారు. ఇక కార్పొరేట్‌, ప్రైవేట్‌ సంస్థలకు కొమ్ము కాస్తు.. విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కారంటూ ఆయన ధ్వజమెత్తారు. విశ్వవిద్యాలయాలలో 50శాతం ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీని మూసివేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ప్రాథమిక హక్కులు,  కరవు అవుతున్నాయని, హైకోర్టును, రాజ్యాంగాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదని లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు