గుణాత్మక మార్పంటే గడీల పాలనా?

5 Mar, 2018 02:55 IST|Sakshi

సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రశ్న 

సాక్షి, హైదరాబాద్‌: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలంటున్న కేసీఆర్, తెలంగాణలో తాను అనుసరిస్తున్న గడీల పాలనను దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నారా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రశ్నించారు. సంతలో పశువులను కొన్నట్టు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొన్న కేసీఆర్, అదే తరహా రాజకీయం జాతీయస్థాయిలో అవసరమని భావిస్తున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. మాటమీద నిలబడే నేత అవసరమని చెప్తున్న ఆయన, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని.. తాను పీఠమెక్కిన తీరుకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.

ఆదివారం లక్ష్మణ్‌ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలు మెచ్చిన పాలననందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రాభవం పెరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కేసీఆర్, అసహనానికి గురై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన ప్రతిపాదిస్తున్న టెంట్‌ లేని ఫ్రంట్‌లను జనం పట్టించుకోరని, గతంలో నేషనల్‌ ఫ్రంట్, థర్డ్‌ఫ్రంట్‌ అంటూ ఎన్నో వచ్చి.. గల్లంతైన విషయాన్ని మరచినట్టున్నారని లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. ఈశాన్య భారతంలో విజయదుందుభి మోగించినట్టుగానే త్వరలో కర్ణాటకలో ఆ తర్వాత తెలంగాణలో కూడా బీజేపీ గెలుస్తుందని, దీన్ని ఊహించే కేసీఆర్‌ దిక్కుతోచని స్థితిలో మాట్లాడతున్నారని అన్నారు. మజ్లిస్‌ ప్రాపకం కోసమే కేసీఆర్‌ మోదీపై విమర్శలు చేస్తున్నారన్నారు. 

మరిన్ని వార్తలు