రాష్ట్రంలో రవాణా స్తంభించిపోయింది: లక్ష్మణ్‌

18 Oct, 2019 12:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనను అటకెక్కించి కేవలం తన ప్రతిష్ట కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మెకు సంఘీభావంగా హైదరాబాద్‌లోని లింగంపల్లి చౌరస్తా నుంచి బీజేపీ శ్రేణులు భారీ బైక్‌ ర్యాలీని శుక్రవారం నిర్వహించాయి. ఈ  సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోందని.. రాష్ట్రంలో కార్యకలాపాలన్ని స్తంభించాయని అన్నారు.

ప్రభుత్వానికి  అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఎదురుతిరిగాయని పేర్కొన్నారు. అలాగే ఉబర్‌, ఓలా క్యాబ్‌ డ్రైవర్లు, ఉద్యోగులు కూడా నిరవధిక సమ్మెకు మద్దతు పలుకుతూ గురువారం నుంచి క్యాబ్‌లను నిలిపివేశారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ తీరు చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతుందని విమర్శించారు. రాష్ట్రంలో రవాణా పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే రవాణా శాఖ మంత్రి స్పందిచకపోవడం బాధాకరం అన్నారు. ‘మళ్లీ నీ తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా భారీ ఉద్యమానికి బీజేపీ నాంది పలుకుతుంది’ అని సీఎం కేసీఆర్‌ను హెచ్చరించారు. (చదవండి: ఆర్టీసీ సమ్మె; రేపు బంద్‌.. ఉత్కంఠ)

>
మరిన్ని వార్తలు