తంబీలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్‌ షా

12 Feb, 2019 07:39 IST|Sakshi

పీయూష్‌ ద్వారా అమలు అన్నాడీఎంకే కమిటీతో సంప్రదింపులు

బీజేపీకి వ్యతిరేకంగా స్వరం పెంచిన తంబిదురై

 పార్లమెంట్‌ వేదికగా విరుచుకుపడ్డ వైనం

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే మెగా కూటమి వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సిద్ధం అవుతున్నారు. అన్నాడీఎంకే కమిటీ సంప్రదింపులు జరిపి, కూటమిని ఖారారు చేయడానికి వ్యూహరచన చేసి ఉన్నారు. రాష్ట్ర ఇన్‌చార్జ్‌ పీయూష్‌ గోయల్‌ ద్వారా వ్యూహాల్ని అమలు చేయించబోతున్నారు. కాగా, అన్నాడీఎంకే మీద సీట్ల ఒత్తిడి పెంచేందుకు అమిత్‌ షా సిద్ధం అయితే, పార్లమెంట్‌ వేదికగా బీజేపీ ప్రభుత్వం మీద అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై విరుచుకుపడటం గమనార్హం. రాష్ట్రంలో మెగాకూటమి లక్ష్యంగా సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ తీవ్ర కసరత్తుల్లో మునిగి ఉన్న విషయం తెలిసిందే. జాతీయ పార్టీ బీజేపీ,  పీఎంకే, డీఎండీకే, పుదియ తమిళగం, పుదియ నిధి, ఐజేకే, ఎస్‌ఎంకేలతో  పాటుగా మరికొన్ని చిన్న పార్టీల్ని కలుపుకుని మెగా కూటమికి చర్యలు చేపట్టి ఉన్నారు.

ఆయా పార్టీల తరఫున ప్రతినిధులు అన్నాడీఎంకే పొత్తు చర్చల కమిటీతో రహస్య మంతనాల్లో మునిగి ఉన్నారు. ఈ మంతనాల జోరు, సంక్లిష్ట పరిస్థితుల మధ్య సాగుతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ప్రధానంగా బీజేపీ కీలక స్థానాల్ని గురిపెట్టి ఉండటం అన్నాడీఎంకేను సందిగ్ధంలో పడేసింది. తమకు బలం ఉన్న నియోజకవర్గాల్నే బీజేపీ ఆశిస్తుండటంతో మల్లగుల్లాలు తప్పడం లేదు. ఆ స్థానాల్ని ఇచ్చే ప్రసక్తే లేదన్నట్టుగా అన్నాడీఎంకే కమిటీ తేల్చింది. బీజేపీ ఆశిస్తున్న వాటిని ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిన ఆ కమిటీ, కేవలం కన్యాకుమారి, తిరునల్వేలి, కోయంబత్తూరు, దక్షిణ చెన్నై, పెరంబలూరు, తెన్‌కాశి, వేలూరు సీట్లను మాత్రమే అప్పగించేందుకు సిద్ధమైనట్టుగా సంకేతాలు వెలువడ్డాయి.

అమిత్‌ షా దృష్టి:
తాము కోరిన స్థానాల్ని అన్నాడీఎంకే ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఇక, స్వయంగా తానే రంగంలోకి దిగాలన్న నిర్ణయానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా వచ్చి ఉన్నారు. అన్నాడీఎంకే కమిటీలోని మంత్రులు ఇప్పటికే పీయూష్‌ గోయల్‌తో పలుమార్లు సంప్రదింపులు జరిపినట్టుగా సంకేతాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా తానే రంగంలోకి దిగి వ్యూహాలకు పదును పెట్టేందుకు అమిత్‌ షా రెడీ అవుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ తనదృష్టిని అంతా తమిళనాడు మీదే ప్రస్తుతం ఉంచిన దృష్ట్యా, తాము గురిపెట్టి ఉన్న స్థానాల్ని అన్నాడీఎంకే మీద ఒత్తిడి తెచ్చి మరీ లాక్కునేందుకు తగ్గట్టుగా అమిత్‌ షా సంప్రదింపులు సాగే అవకాశాలు ఉన్నట్టు కమలనాథులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వైద్యచికిత్సల అనంతరం విదేశాల నుంచి స్వదేశానికి చేరుకున్న దృష్ట్యా, ఆయన బాధ్యతల్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఉన్న పీయూష్‌ గోయల్‌కు విరామం లభించినట్టే అని పేరొంటున్నారు. రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమితులైన పీయూష్‌ గోయల్‌ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగబోతున్నారు. పీయూష్‌ ద్వారా తన వ్యూహాలకు పదును పెట్టించడమే కాదు, తానే తమిళనాడుకు వచ్చి అన్నాడీఎంకే సమన్వయ కమిటీ మీద ఒత్తిడి పెంచేందుకు నిర్ణయించి ఉన్నట్టుగా కమలనాథులు పేర్కొంటున్నారు. 

తంబి స్వరం: 
ఆది నుంచి బీజేపీతో పొత్తును బహిరంగంగా అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై వ్యతిరేకిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా మీడియా ముందు తీవ్రంగానే స్పందిస్తూ వస్తున్న తంబిదురై తాజాగా పార్లమెంట్‌ వేదికగా విరుచుకు పడటం గమనార్హం. అన్నాడీఎంకే సీనియర్‌గా ఉన్న తంబిదురై వ్యాఖ్యలను పార్టీలో ఏ ఒక్కరూ ఖండించడం లేదు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయంగానే భావిస్తూ వస్తున్నారు. అయితే, ఇదంతా అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కనుసన్నల్లో సాగుతున్న వ్యవహారం అన్న ప్రచారం కూడా ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా తంబిదురై ద్వారా ఓ వైపు గళాన్ని వినిపింప చేస్తూ, మరో వైపు వారి ఒత్తిళ్లకు తలొగ్గకుండా అన్నాడీఎంకే జా›గ్రత్తగానే వ్యవహరిస్తోంది. తాజాగా సీట్ల పందేరాలు, చర్చలు సంక్లిష్టంగా మారిన దృష్ట్యా, ఏకంగా పార్లమెంట్‌ వేదికగా తంబి తన స్వరాన్ని పెంచడం గమనార్హం. ప్రధానంగా ప్రధాని నరేంద్రమోదీని గురిపెట్టి ఆయన వ్యాఖ్యల తూటాల్ని పరోక్షంగా పేల్చడం ఆలోచించ దగ్గ విషయం. బీజేపీ ప్రభుత్వం అన్ని రకాలుగా కేంద్రంలో విఫలం అయిందని ధ్వజమెత్తుతూ, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ దిశగా వ్యాఖ్యల్ని తంబి సంధించారు. చివరకు తామేమి భిక్ష’గాళ్లమా..? అన్నట్టుగా విరుచుకుపడటం, జీఎస్‌టీ వ్యవహారంలో తమిళనాడుకు కేటాయింపు వ్యవహరాన్ని అస్త్రంగా చేసుకుని తంబి స్వరాన్ని పెంచడం కమలనాథుల్ని విస్మయంలో పడేసినట్టు అయ్యింది.
 

మరిన్ని వార్తలు