కమలం బల్దియా బాట 

10 Nov, 2019 09:40 IST|Sakshi

పట్టణాల్లో పాదయాత్ర

మున్సిపాల్టీల్లో ముందస్తు ప్రచారం

భవిష్యత్‌పై బీజేపీ భరోసా

సాక్షి, మంచిర్యాల : మున్సిపల్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ పట్టణ బాట పట్టింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పాగా వేయాలనే తపనతో ఇప్పటినుంచే పునాది వేసుకునేందుకు పాదయాత్ర చేపట్టింది. గాంధీ సంకల్పయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ నాయకుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పాదయాత్ర ఇప్పటికే చెన్నూరు, మంచిర్యాల పట్టణాల్లో పూర్తి కాగా.. మరో ఐదు మున్సిపాల్టీల్లో కొనసాగనుంది.

పట్టణాల్లో పాదయాత్ర
దేశవ్యాప్తంగా గాంధీ సంకల్పయాత్ర పేరుతో సంబంధిత నియోజకవర్గాల్లో నేతలు పాదయాత్ర చేపట్టాలని బీజేపీ నిర్ణయించడం తెలిసిం దే. ఇందులో భాగంగా పార్టీ నేత, మాజీ ఎంపీ జి.వివేక్‌ జిల్లాలో పాదయాత్ర చేపట్టారు. జిల్లాలోని చెన్నూరు, మంచిర్యాల, నస్పూరు, లక్సెట్టిపేట్, క్యాతన్‌పల్లి, మందమర్రి, బెల్లంపల్లిల్లో నిర్వహించేలా యాత్రకు రూపకల్పన చేశారు. చెన్నూరు పట్టణంలో ఈనెల 2న ఆయన పాదయాత్ర ప్రారంభించారు. చెన్నూరులో ఒకరోజు పర్యటించిన అనంతరం, మళ్లీ ఈ నెల 7న మంచిర్యాల పట్టణంలో యాత్ర నిర్వహించారు. 

ముందస్తు ప్రచారం
సంకల్పయాత్రను బీజేపీ మున్సిపల్‌ ఎన్నికల ప్రచా రానికి మలచుకున్నట్లు కనిపిస్తోంది. పట్టణాల్లో చేపడుతున్న యాత్రలో భాగంగా ఇంటింటికీ వెళుతున్న నేతలు.. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించడంతో పాటు, తమ పార్టీ మున్సిపాల్టీల్లో అధికారంలోకి వస్తే పట్టణాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు.

పనిలోపనిగా వ్యాపార, వాణిజ్య వర్గాల ను కలిసి మద్దతు కోరుతున్నారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులనే గెలిపించాలని ఇప్పటినుంచే అభ్యర్థిస్తున్నారు. స్థానికంగా వార్డుల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ, వాటిని ప్రస్తావిస్తూ ముం దుకు సాగుతున్నారు. తాము అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరిస్తామంటూ ప్రజానీకానికి భరో సా ఇస్తున్నారు. ఆయా వార్డుల్లో పార్టీ టికెట్‌ ఆశిస్తున్న నాయకులు కార్యకర్తలను సమీకరిస్తున్నారు. 

యాత్ర ఫలించేనా..!
దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రధానిగా నరేంద్రమోదీ నిర్ణయాలు, తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న వైనం తమకు మున్సిపల్‌ ఎన్నికల్లో విజయాన్ని తెచ్చిపెడుతాయనే ధీమాతో బీజేపీ నేతలున్నారు. ఇప్పుడు, అప్పుడు అంటూ మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా పడుతున్నా, ఎప్పుడో ఒకప్పుడు నిర్వహించాలి్సందేనని, ఆ లోగా తమ పార్టీ మరింత బలపడుతుందంటున్నారు.

ఇప్పటికే మున్సిపాల్టీల వారిగా స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పార్టీ శ్రేణులు ఆందోళనలో ముందుంటున్నాయి. తాజాగా పట్టణాల్లో చేపడుతున్న పాదయాత్ర కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు దోహదం చేస్తుందనే విశ్వాసంతో ఉన్నారు. అందివచి్చన ప్రతీ అవకాశాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించుకునే దిశగా బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు