‘పేకాటలో జోకర్‌లా మిగిలింది ఆయన ఒక్కడే’

22 May, 2019 19:23 IST|Sakshi
బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కె. లక్ష్మణ్‌(పాత చిత్రం)

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చెయ్యడంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా విఫలమైందని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్‌ విమర్శించారు.  బుధవారం బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్‌ విలేకరులతో చిట్‌చాట్‌ చేశారు. తెలంగాణాలో రెండు పార్టీల విధానం వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్యనే గట్టి పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌లో సంజయ్‌, అర్వింద్‌లు ఈరోజు ఢీ అంటే ఢీ అన్నట్లు కొట్లాడుతున్నారు అంటే అది మా పార్టీ గొప్పతనమేనని అన్నారు. దక్షిణాదిన సొంతంగా బీజేపీ ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

బాబు వల్లనే బీజేపీ తీవ్రంగా నష్టపోయింది
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో పొత్తు పెట్టుకోవడం వల్లనే గతంలో బీజేపీ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు పరిస్థితి ఎడ్లబండిని మోస్తున్న అని అనుకుంటున్న కుక్క పిల్లలాగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో పేకాటలో జోకర్‌లాగా మిగిలింది చంద్రబాబు ఒక్కడేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పెట్టిన ప్రతిపక్షాల మీటింగ్‌కి ఎవరూ రాలేదని గుర్తు చేశారు. ఇప్పుడు వాళ్లకు వాళ్లే తన్నుకు చస్తున్నారని అన్నారు. చంద్రబాబు రాజకీయాల్లో నిజాయతీ గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందన్నారు. చంద్రబాబు చచ్చిన పాము.. తాము ఆయనను టార్గెట్‌ చెయ్యాల్సిన కర్మ పట్టలేదన్నారు. 

రెచ్చగొట్టింది కేసీఆరే
మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కాకుండా ఇప్పుడు చేసినన్ని కుట్రలు ఇంతకుముందెన్నడూ జరగలేదని అన్నారు. హిందువులు బొందువులు అన్నది కేసీఆరే.. రెచ్చగొట్టింది కేసీఆరే.. మోదీ, అమిత్‌ షాలు అభివృద్ధి అంశాలు గురించి మాత్రమే ప్రచారం చేశారని అన్నారు. కేసీఆర్‌ దగ్గర అభివృద్ధి ఎజెండా లేదు కాబట్టే దృష్టి మరల్చే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణాలో చాలా మార్పులు ఉంటాయన్నారు.

హరీష్‌ రావునైనా తీసుకుంటాం
మా పార్టీ విధానాలు, సిద్ధాంతాలు నమ్మి పార్టీ అనుగుణంగా పనిచేస్తే మాజీ మంత్రి హరీష్‌ రావునైనా పార్టీలో చేర్చుకుంటామని, అయితే రాజీనామా చేసిన తర్వాతే పార్టీలోకి చేర్చుకుంటామని స్పష్టం చేశారు. గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ కండువాలు వేసుకున్న వారు కూడా మోదీ పీఎం కావాలని కమలం గుర్తుపై ఓటేశారని అన్నారు. టీఆర్‌ఎస్‌ పేలిపోయే బుడగ అని ఎద్దేవా చేశారు. చాలా మంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.. అమిత్‌ షా సమయం ఇవ్వగానే వాటి మీద నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌లో గెలుపు అవకాశాలు ఉన్నాయని వ్యాక్యానించారు.
 

మరిన్ని వార్తలు