రంగంలోకి ఎస్‌ఎం కృష్ణ తనయ

16 Apr, 2018 08:16 IST|Sakshi
శాంభవి(ఫైల్‌)

యశవంతపుర లేదా శాంతినగరనుంచి బీజేపీ టికెట్‌?

కేంద్రమంత్రులతో చర్చలు

సాక్షి, బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడుడు ఎస్‌ఎం కృష్ణ కుమార్తె శాంభవి ఈసారి ఎన్నికల బరిలో దిగనున్నారు. బెంగళూరులో శాంతినగర లేదా యశవంతపుర నియోజకవర్గం నుంచి ఆమె బీజేపీ టికెట్‌తో పోటీ చేసే అవకాశముంది. కేంద్రమంత్రులు  అనంతకుమార్, ప్రకాష్‌ జవదేకర్‌ రెండురోజుల క్రితం సదాశివనగర్‌లో శాంభవితో సమావేశమయ్యారు. శాంభవిని పోటీకి నిలపాలని వారు ఎస్‌ఎం కృష్ణను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. కాగా, శాంభవికి టికెట్‌ కోసం ఎస్‌ఎం కృష్ణ ముందునుంచీ ప్రయత్నాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరినా పెద్దగా దక్కిన తాయిలాలు లేవనే చెప్పాలి. పైగా ఆయన అల్లుడు సిద్ధార్థ్‌కు చెందిన రెస్టారెంట్లు, ఆస్తులపై ఐటీ శాఖ భారీఎత్తున దాడులు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతకాలంగా కృష్ణ ముభావంగా ఉంటున్నారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనడం లేదు.

అక్కడే ఎందుకంటే.. ఎస్‌ఎం కృష్ణ ఒక్కళిగ. యశవంతపుర నియోజకవర్గంలోనూ ఒక్కళిగ కులస్తులు ఎక్కువగా ఉండటంతో అక్కడ పోటీ చేస్తే కూతురికి కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. శాంతినగర నియోజకవర్గంలో సంపన్న, మధ్యతరగతి జనాభా అధికం. అక్కడ అయినా ఫర్వాలేదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కాగా బెంగళూరు, మండ్య, మైసూరు తదితర ప్రాంతాల్లో ప్రచారం చేయాలని ఎస్‌ఎం కృష్ణను ఈ సందర్భంగా కేంద్రమంత్రులు కోరినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు