బీజేపీ ‘స్టార్‌ వార్‌!’

1 Dec, 2018 05:26 IST|Sakshi

ప్రచారం ముమ్మరం చేసిన కమలనాథులు

ఇప్పటికే ఒకసారి ప్రధాని మోదీ, రెండుసార్లు అమిత్‌షా పర్యటన

2,3 తేదీల్లో మళ్లీ రాష్ట్రానికి రాక

నేడు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకెళ్తోంది. స్టార్‌ క్యాంపెయినర్ల ప్రచారం జోరుగా సాగుతోంది. మరికొంత మంది కీలక నేతలను ఆ పార్టీ రంగంలోకి దించనుంది.  ప్రత్యేక దృష్టి సారించిన  నియోజకవర్గాల్లో స్టార్‌ క్యాంపెయినర్లతో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రధాని మోదీ మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ బహిరంగ సభల్లో పాల్గొనగా, అమిత్‌షా 9 నియోజకవర్గాల్లో బహిరంగసభలు, రోడ్‌షోల ద్వారా ప్రచారం చేశారు.

కేంద్ర ఆరోగ్యమంత్రి జగత్‌ప్రకాశ్‌ నడ్డా హైదరాబాద్‌లోనే మకాం వేసి, పార్టీ నియోజకవర్గ సమావేశాలు నిర్వహించడంతోపాటు అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, సాధ్వి నిరంజన్‌ జ్యోతి, సంతోష్‌ గంగ్వార్, పార్టీ సీనియర్‌ నేతలు మురళీధర్‌రావు, రాంమాధవ్, పురంధేశ్వరి, స్వామి పరిపూర్ణానంద వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించిన  సభల్లో పాల్గొన్నారు. విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ మేడ్చ ల్‌ అభ్యర్థి మోహన్‌రెడ్డి తరఫున ప్రచారం చేశారు.  పరిపూర్ణానంద  ఇప్పటికే పదుల సంఖ్యలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేయగా, మరిన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.   

నేటి నుంచి ఐదో తేదీ వరకు కీలకసభలు  
ఈ నెల ఒకటి(శనివారం) నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే బహిరంగ సభలు తమకు ఎంతో కీలకమైనవని బీజేపీ పేర్కొంటోంది. ఈ నెల 3న హైదరాబాద్‌లో నిర్వహించే ప్రధాని మోదీ సభ తరువాత తెలంగాణలో పరిణామాలు మారుతాయని, బీజేపీకి మరింత అనుకూల పరిస్థితి ఏర్పడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.  ఈ నెల 2 న అమిత్‌షా నారాయణ్‌పేట్, కల్వకుర్తి (ఆమనగల్‌), కామారెడ్డి బహిరంగసభలు, ఉప్పల్, మల్కాజిగిరి రోడ్‌ షోలలో పాల్గొననున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ 2న భూపాలపల్లి, ముధోల్, బోధన్, తాండూరు, సంగారెడ్డిలో, 5న కరీంనగర్, వరంగల్, గోషామహల్‌లో నిర్వహించే బహిరంగసభల్లో పాల్గొననున్నారు. 4న కేంద్రమంత్రులు స్మృతిఇరానీ, రవిశంకర్‌ ప్రసాద్‌ల సభలు నిర్వహించనున్నారు. శనివారం(నేడు) ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌ భద్రాచలం, ఎల్లారెడ్డి, ఖైరతాబాద్‌ బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు.

మరిన్ని వార్తలు