తెలంగాణ ప్రజల ఆశ ఆవిరైంది!

2 Jun, 2019 11:10 IST|Sakshi

రాష్ట్రం ఆవిర్భవించి ఐదేళ్లు అవుతున్నా..

ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన లేదు

అవతరణ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్‌ 

సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్‌ పరిపాలనలో తెలంగాణ ప్రజల ఆశ ఆవిరైపోయిందని, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఐదు సంవత్సరాలు అవుతున్నా.. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగడం లేదని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా కే లక్ష్మణ్  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నల్లు ఇంద్ర సేనరెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

నిజాం తరహా నిరంకుశ పాలన సాగిస్తున్న కేసీఆర్ కుటుంబ కబంధహస్తాల నుంచి తెలంగాణను కాపాడేందుకు బీజేపీ మరో పోరాటానికి సిద్ధమవుతోందన్నారు.  కేసీఆర్‌ ప్రభుత్వం రెండు లక్షల కోట్లపైనే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలని వమ్ము చేసిందని, ఇంటికో ఉద్యోగం అన్నారు ఏ ఇంటికి ఉద్యోగం రాలేదని, కానీ కేసీఆర్ ఇంట్లో ఐదు ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఏ పరీక్షలను సక్రమంగా నిర్వహించలేదని, ఇంటర్ పరీక్షల ఫలితాలో తప్పిదాల వల్ల 26 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేసేందుకు బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేసిందన్నారు. 
 

మరిన్ని వార్తలు