'మా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు'

4 Mar, 2020 14:42 IST|Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్న కాంగ్రెస్‌ ఆరోపణలతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తమ ప్రభుత్వంలోని ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు బలవంతంగా తీసుకెళ్లి హర్యానాలోని ఒక హోటల్‌లో నిర్భందించారని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి జితూ పట్వారీ పేర్కొన్నారు. 'మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, మంత్రులు నరోత్తం మిశ్రా, భూపేంద్ర సింగ్‌, రామ్‌పాల్‌ సింగ్‌ సహా మరికొంత మంది సీనియర్‌ బీజేపీ నేతలు కలిసి మా పార్టీకి చెందిన నలుగురు, బహుజన్‌ సమాజ్‌ పార్టీ నుంచి ఇద్దరు, సమాజ్‌వాది నుంచి ఒకరు, మరొక ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేను  హర్యానాలోని ఒక హోటల్‌కు తరలించారు. కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు.తీసుకెళ్లొద్దని చెప్పినా వినకుండా మమ్మల్ని హోటల్‌కు తరలించారని ఒక ఎమ్మెల్యే మాకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. వారిని వెంటనే వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.ఇప్పటికే నలుగురు తిరిగొచ్చారు' అని పట్వారీ పేర్కొన్నారు. (ప్రభుత్వాన్ని కూలిస్తే ఎమ్మెల్యేకు రూ.45​కోట్లు)

అంతకుముందు మాజీ ఎంపీ దిగ్విజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. అధికార కూటమిలో ఉన్న బహుజన్‌ సమాజ్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను బీజేపీ నాయకులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారని ఆరోపించారు. కుట్రలో భాగంగా బారీ మొత్తంలో నగదు ఇవ్వజూపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేలను తిరిగి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ నేతలు హరియాణాలోని హోటల్‌కు వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడి పోలీసులు అడ్డుకున్నట్లు వార్తలు వచ్చినట్లు తెలిసింది. (ప్రధాని మోదీకి ఎంపీ ముఖ్యమంత్రి సవాల్‌!)

కాగా దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ స్పందించారు. మధ్యప్రదేశ్‌లో మా ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు వల వేస్తుందని, తమకు ఫ్రీ మనీ వస్తోందని ఎమ్మెల్యేలు తనతో చెబుతున్నారని ఆయన అన్నారు. ఎవరు పార్టీలో నుంచి వెళ్లిపోయినా మా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంలేదని కమల్‌నాథ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు